యూపిలో ఊపందుకున్న ప్రచారం
బిజెపి,ఎస్పీ పోటాపోటీ ప్రచారం
ఆవుపేడతో ఆదాయం అంటూ కాంగ్రెస్ హావిూ
లక్నో,ఫిబ్రవరి8(జనంసాక్షి): ఉత్తరప్రేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో తమదే విజయం అన్న ధీమాలో దికార బిజెపి,విపక్ష సమాజ్‌వాది ధీమాగా ఉన్నాయి. ప్రియాంక ఛరిష్మాతో గట్టెక్కుతామని కాంగ్రెస్ ఆశగా చూస్తోంది. అందుకేకాంగ్రెస్ మహిళా ఓట్లపై ఆధారపడి వారికి ఎక్కువగా టిక్కెట్లు కేటాయించింది. వారికి ఉద్యోగాల్లో 40శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. కానీ పోటీ మాత్రంబిజెపి, ఎస్పీల మధ్యనే సాగుతోంది. కాంగ్రెస్ అవినీతిని అంతమొందించేందుకు, ఆ పార్టీ నాశనం చేసిన సంస్కృతి పరిరక్షణకు బిజెపి కృషి చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. మధుర, రాముడి జన్మకేంద్రం అయోధ్య ఇప్పుడు ప్రచారంలో ప్రధాన వస్తువులుగా మారాయి. సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. గతంలో అధికారంలో ఉన్న సమాజవాది నేతలు ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ కుటుంబ పాలన కేంద్రాలుగా మారినట్లు బిజెపి ధ్వజమెత్తింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలు`విమర్శలకు గురైన కుటుంబ సభ్యులను బిజెపి చేరదీసింది. ములాయం సింగ్ కోడలైన అపర్ణా యాదవ్, బావమరిది, మాజీ ఎంఎల్‌ఏ ప్రమోద్ గుప్తాను పార్టీలో చేర్చుకుంది. దీంతో తనకు కుటుంబ భారాన్ని బిజెపి తగ్గించిందని అఖిలేష్ యాదవ్ చమత్కరించారు. అధికారం కోసం పార్టీలు, నేతలు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ చేస్తున్నాయి. ఇకపోతే కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఆవుపేడ కొనుగోలు చేస్తామని రైతులకు వాగ్దానం చేసింది. తమ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో
ఇప్పటికే ఈ పథకాన్ని అమలు జరుపుతున్నామని, తమను ఎన్నుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో కూడా అమలు చేస్తామని చెప్పింది. గోబర్ ధన్ న్యాయ యోజన పథకం కింద కిలో రు.1.50 వంతున ఆవు పేడ కొని సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందచేస్తామని గతేడాది జులైలో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్ష బిజెపి అప్పుడు విమర్శించింది. అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ ప్రభుత్వం ఆవుపేడను సేకరించి ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ తలపెట్టినట్లు గతేడాది ప్రకటించారు. అంతే కాదు. పశువులకు సుస్తీ చేసినపుడు 109 నంబరుకు ఫోన్ చేస్తే వైద్యులు ఇంటికి వచ్చి చికిత్స చేస్తారని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో రైతులెవరూ పేడ అమ్మరని బిజెపి మాజీ మంత్రి అజయ చక్రధర్ అన్నారు. మొత్తంగా ఇప్పుడు ప్రజలు ఎవరిని ఆదరిస్తారన్ని చూడాలి.