యూపిలో తుదిదశకు ఎన్నికల ప్రచారం

వారణాసిలో మోడీ భారీ రోడ్‌షో
పోటీగా అఖిలేశ్‌ ర్యాలీ
లక్నో,మార్చి4(జనం సాక్షి ): యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. మార్చి 7న తుది విడత పోరు నేపధ్యంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూపీలో యోగి ఆదిత్యానాధ్‌ సారధ్యంలో బీజేపీ సర్కార్‌పై ఎస్‌పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ విరుచుకుపడ్డారు. మౌలో శుక్రవారం జరిగిన
ర్యాలీలో అఖిలేష్‌ మాట్లాడుతూ కాషాయ పార్టీపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. తాము దేశం గురించి మాట్లాడుతుంటే బీజేపీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. యువతకు తాము ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తామని, రైతులకు ఉచిత విద్యుత్‌ కల్పిస్తామని అఖిలేష్‌ వరాలు కురిపించారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో అఖిలేష్‌ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కాశీలో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. మోడీ వెంట వేలాదిమంది ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఇక కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ దళితుల ఓట్లను ఆకర్షించేందుకు వారణాసిలోని కబీర్‌ చౌర మఠ్‌లో మూడురోజుల పాటు మకాం వేయనున్నారు. సంత్‌ కబీర్‌ దాస్‌ తన జీవితమంతా కబీర్‌ చౌరా మఠ్‌లో గడిపారు. సంత్‌ కబీర్‌దాస్‌ సామాజిక న్యాయం, సమానత్వ నినాదాలను అందింపుచ్చుకున్న దళిత ఓటర్లను కాంగ్రెస్‌ పార్టీ వైపు ఆకర్షించేలా ప్రియాంక వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. ఏడున జరిగే ఏడో దశ పోలింగ్‌ 54 స్ధానాల్లో జరగనుండగా ఈ ప్రాంతంలో అధికంగా బీసీలు, దళితుల ఓట్లున్నాయి. ఈ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు వరాలు ప్రకటించింది. ప్రియాంక, రాహుల్‌ శుక్రవారం పింద్రా జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కాశీ విశ్వనాధ ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా, కుల సవిూకరణలకు పెట్టింది పేరైన యూపీలో యాదవులు ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్‌ యాదవ్‌ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతుండగా యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.