రక్షణరంగాన్ని ప్రైవేటీకరించవద్దు

రెండోరోజూ కొనసాగిన డాక్‌యార్డ్‌ ఆందోళన

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): రక్షణ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రధానంగా విదేశీ పెట్టుబడి విధానాన్ని రద్దు చేయాలని విశాఖ పట్టణం నావెల్‌ డాక్‌ యార్డు ఎన్‌సీఈ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఐఎన్‌డీడబ్ల్యూఎఫ్‌, ఏఐడీఈఎఫ్‌, బీపీఎంఎఫ్‌ దిల్లీ రక్షణ రంగానికి చెందిన మూడు ఫెడరేషన్స్‌ పిలుపు మేరకు మూడు రోజుల సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం కూడా నావెల్‌ డాక్‌ యార్డుతో పాటు మిగతా రక్షణ రంగ సంస్థల యూనిట్ల గేట్ల ఎదుట ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిరసనలో పాల్గొన్న యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యంగా నూతన పింఛను విధానాన్ని నిలిపి వేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రెండో రోజు విధులకు వెళ్లకుండా సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కూడా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ రంగ సంస్థల యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు, శంకర్రావు, చిట్టిరాజు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.