రక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే తమ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు
అది కూడా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్న శిబిరాలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రాస్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో తక్షణమే యుద్దాన్ని నిలిపేయాలి. వాయు, భూమి, నావికా త్రివిధాలుగా ఉక్రెయిన్ అంతటా సైనిక ఆపరేషన్లు విస్తరిస్తున్నాయి. వీటిని తక్షణమే ఆపేయాలని ఆయన కోరారు. జరిగిందేదో జరిగి పోయింది. సైనికులందరూ వారివారి శిబిరాలకు వెళ్లిపోవాలి. నాయకులు శాంతిమార్గం పట్టాలి. పౌరులను కచ్చితంగా పరిరక్షించాలని గుటెర్రాస్ నొక్కి చెప్పారు. రష్యా అణ్వాయుధ బలగాలను హైఅలర్ట్ చేసిందనీ, అణ్వాయుధాలు వినియోగించడం వల్ల జరిగేదేదీ న్యాయం కాబోదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా ` రష్యా దౌత్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా న్యూయార్క్‌లో సేవలందిస్తున్న 12 మంది రష్యా దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది. మార్చి 7వ తేదీలోగా తమను దేశం విడిచి వెళ్లాల్సిందిగా అమెరికా అధికారులు ఆదేశాలు జారీ చేశారని రష్యా దౌత్య ప్రతినిధి వాస్సిలీ నెబెంజియా తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న సైనిక ఆపరేషన్లలో చోటుచేసుకునే యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపడతామని అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం(ఐసిసి) ప్రకటించింది. ఉక్రెయిన్ ను కక్షిదారుగా చేర్చకుండానే తామే వీలైనంత త్వరగా దర్యాప్తును ప్రారంభిస్తామని ఐసిసి దర్యాప్తు అధికారి కరీం ఖాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపోతే దాడుల కారణంగా ఉక్రెయిన్ నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెఉళుతున్నారు. భారత్ తమ పౌరులను క్షేమంగా తీసుకుని వచ్చే కార్యక్రమం కొనసాగి స్తోంది. దేశ రాజధాని కీవ్‌లో జరిగిన పేలుళ్లలో టివి టవర్ దెబ్బతిందని, ఆర్గురు పౌరులు చనిపో యారని రష్యన్ టెలివిజన్ తెలిపింది. ఖర్కివ్‌పై జరిగిన క్షిపణి దాడుల్లో పలు ప్రభుత్వ భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక చిన్నారి సహా ఎనిమిదిమంది పౌరులు, 70 మంది దాకా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మరో పేలుడు ఘటనలో కర్ణాటక విద్యార్థి ఒకరు చనిపోయినట్లు భారత విదేశాంగ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. ఎనిమిందిమంది పౌరులు మరణించారని తెలిపింది. స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది. గత గురువారం రష్యా సైనిక ఆపరేషన్ చేపట్టిననాటి నుంచి ఇప్పటి వరకూ 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 14 మంది చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఈ యుద్దం రష్యాకు కూడా తీరని భారాన్ని మోపుతుందనడంలో సందేహం లేదు. ఇది విస్తరించకుండా ఇరు దేశాలు సంయమనంతో చర్చల ప్రక్రియను ఫలప్రదంగా ముగించడం మేలు.