రజత సింధూరం
– ఐనా మనసింధూ బంగారమే
– ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజతం
– పోరాడి ఓడినా జనహృదయంలో స్థానం
– శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రియో డి జనీరో,ఆగస్టు 19(జనంసాక్షి):భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తెలుగింటి ఆడబిడ్డ, భారత అగ్రశ్రేణి షట్లర్ పూసర్ల వెంకట సింధు రికార్డు సృష్టించింది. ఆడింది.. తొలి ఒలింపిక్సే అయినా బ్యాడ్మింటన్‌లోనూ, ఏ క్రీడలోనైనా సరే.. రజతం గెలిచిన తొలి భారత మహిళగా తన పేరు లిఖించుకొంది. ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, కఠిన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)తో బంగారు పతకం కోసం తన శక్తికి మించి పోరాడింది. ఉత్కంఠగా సాగిన పోరులో ఆమె 21-19, 12-21, 15-21తో ఓటమి చవిచూసింది. అయితే భారత్‌కు రెండో వ్యక్తిగత స్వర్ణం తెచ్చేందుకు ఆమె చేసిన పోరాటానికి120 కోట్ల మంది భారతీయులు ముగ్ధులయ్యారు. స్టేడియంలోనైతే పాయింట్ కోల్పోయిన ప్రతిసారీ ‘లెట్స్ గో ఇండియా.. లెట్స్ గో ఇండియా’ అంటూ ఆమెను ఉత్సాహ పరిచారు. ఆమె ఆట చూడాలని దేశవ్యాప్తంగా అనేక చోట్ల అతి పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాకాలతో యువత అక్కడికి చేరి ఒక్కటయ్యారు. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ కోసం ఎంత హడావుడి ఉంటుందో.. సింధు విజయం కోసం దేశం అలాగే సిద్ధమయింది.
తొలి గేమ్ విజయంతో ఆశలు రేపి
ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో తెలివైన క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్‌ను తొలిగేమ్‌లో మట్టికరిపించిన సింధు స్వర్ణ పతకంపై ఆశలు రేపింది. క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లు, నెట్‌గేమ్‌తో 21-19తో ప్రత్యర్థిని ఓడించింది. తొలుత 3-7తో ఉన్న దశ నుంచి మ్యాచ్ 15-16 వచ్చే వరకు ¬రా¬రీగా సాగింది. ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింటు సాధిస్తూ ముందుకు పోయారు. మారిన్ పుంజుకొని 19-16తో గేమ్ పాయింట్‌ను సవిూపించింది. ఈ దశలో అద్భుతంగా పుంజుకొన్న సింధు.. వరుసగా ఆరు పాయింట్లు సాధించి 21-19తో తొలిగేమ్ కైవసం చేసుకొంది. అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తిగా తడబడింది. మారిన్ తన తెలివినంతా ఉపయోగించి ఆది నుంచే వరుస పాయింట్లు సాధిస్తూ సింధును ఒత్తిడిలోకి నెట్టింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4-0తో ఉన్న మారిన్ నెట్‌గేమ్, హాఫ్ స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్ స్మాష్‌లు సంధిస్తూ 21-12తో గేమ్ గెలుచుకొంది. అనవసర తప్పిదాలతో సింధు ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చింది.
ఇక మూడో గేమ్‌లో మారిన్ మరింత రెచ్చిపోయింది. సింధు పుంజుకుంటున్న ప్రతి దశలోనూ క్రాస్‌కోర్టు షాట్లు, స్మాష్‌లతో ఆమెను దెబ్బతీసింది. చూస్తుండగానే 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ 4-9తో ఉన్నవేళ సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 8-9తో నిలిచింది. అయితే సింధు సర్వీస్‌ను బ్రేక్ చేసిన మారిన్ నెట్ దగ్గరే అద్భుతంగా సర్వీసులు చేస్తూ సింధును అసహనానికి గురిచేసింది. సింధు 10-10తో స్కోర్ సమం చేసేందుకు దీర్ఘర్యాలీ ఆడింది. ఈ దశలో మారిన్ నాలుగు వరుస పాయింట్లతో 14-10తో దూసుకుపోయింది. ఇక్కడ మారిన్ సర్వీస్ బ్రేక్ చేసిన సింధు రెండు పాయింట్లు సాధించి 12-15తో నిలిచింది. అయితే సింధు వరుస పాయింట్లు సాధించకుండా మారిన్ చాకచక్యంగా వ్యవహరించింది. సింధును కోర్టుకు నలువైపులా తిప్పుతూ అలసిపోయేలా చేస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది. మ్యాచ్ 14-16తో ఉన్నప్పుడు మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు కొట్టి 20-14తో గేమ్ పాయింట్‌ను సవిూపించింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ సాధించి 15-20తో ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మారిన్ క్రాస్‌కోర్ట్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించింది.
సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి రజతాన్ని అందించిన పీవీ సింధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. సింధు శిక్షకుడు గోపీచంద్‌ను కూడా అభినందించారు సీఎం. యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం చెప్పారు.వరల్డ్ చాంపియనే ఒలింపిక్ విజేత. మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్లో స్పెయిన్ షట్లర్ మారిన్ కరోలినా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఫైనల్లో హైదరాబాదీ ప్లేయర్ సింధు ఓటమి పాలైంది. ¬రా¬రీగా సాగిన మ్యాచ్ లో కీలకమైన మూడవ సెట్ లో సింధు డీలాపడడంతో మ్యాచ్ చేజారిపోయింది. ఏదేమైనా సింధు అసమాన పోరాటాన్ని ప్రదర్శించింది. తొలి సారే ఒలింపిక్స్ ఆడుతున్న సింధు ఫైనల్ కు చేరడం విశేషం.




