రష్యాతో చమురు వాణిజ్యంలో భారత సంపన్నులే లాభపడుతున్నారు
` కొనుగోళ్ల వ్యవహారంపై మరోసారి స్పందించిన అమెరికా
` రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఆంక్షలు
` వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్(జనంసాక్షి):రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్‌ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్‌పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్‌లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్‌లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘’బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు.ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్‌లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ..చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, దేశాలు రష్యా చమురుపై 60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు…ఇక చైనాపై సెకండరీ టారిఫ్‌లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్‌లు విధించలేదు అని అన్నారాయన.
రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఆంక్షలు: అమెరికా
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ భారీగా సుంకాల భారాన్ని మోపిన సంగతి తెలిసిందే.దీనిపై తాజాగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు న్యూదిల్లీపై ట్రంప్ సుంకాలు విధించారన్నారు మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అధ్యక్షుడు నిశ్చయించుకున్నారని లీవిట్ పేర్కొన్నారు. రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకొని దానిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారని తెలిపారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహమని వ్యాఖ్యానించారు. ఇందులోభాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే యుద్ధం ముగింపునకు తొలి అడుగుగా అభివర్ణించారు. ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. ఈసందర్భంగా ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అసలు రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యుండేది కాదని ఉద్ఘాటించారు. పుతిన్ కూడా ఇదే పేర్కొనడాన్ని ఆమె గుర్తు చేశారు. ఈసందర్భంగా భారత్- పాక్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని లీవిట్ మరోసారి పేర్కొన్నారు. న్యూదిల్లీ ఈ వాదనలను ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వస్తుంది. కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని పలుమార్లు స్పష్టంచేసింది. అయినప్పటికీ యూఎస్ అధికారులు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం.
భారత్ విషయంలో అమెరికా తీరు అన్యాయం:రష్యా
మాస్కో(జనంసాక్షి):తమ దేశం నుంచి చమురు కొనుగోలు అంశంలో భారత్‌పై అమెరికా వైఖరి అన్యాయంగా ఉందని రష్యా ఆరోపించింది. ఈమేరకు ఆ దేశ దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ పేర్కొన్నారు. భారత్-రష్యా మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోను కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం న్యూదిల్లీ సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. భారత్‌తో సంబంధాలపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థలను ఆయుధంలా వాడుతోందని విమర్శించారు. వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఆంక్షలు విధించరని వాషింగ్టన్‌ను దెప్పిపొడిచారు. రష్యా భవిష్యత్తులోను భారత్ అలాంటి చర్యలు తీసుకోదన్నారు. భారత్‌కు ఎటువంటి ఇబ్బందిలేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసిందన్నారు. ప్రస్తుతం సగటున 5 శాతం డిస్కౌంట్‌తో భారత్ అవసరాల్లో 40శాతం సరఫరా చేస్తున్నామన్నారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు భారత్ ఇబ్బంది పడుతుంటే.. రష్యా మార్కెట్లు స్వాగతం పలుకుతాయని చెప్పారు.భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో అండగా ఉండటానికి తమ దేశం కట్టుబడి ఉందని రోమన్ వెల్లడిరచారు. చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్లపై చర్చలు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. భారత్‌లో ఉత్పత్తులు చేయడానికి న్యూదిల్లీకి సరైన భాగస్వామి రష్యానే అని పేర్కొన్నారు. గతంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీని గుర్తుచేశారు. శక్తిమంతమైన జెట్ ఇంజిన్ల తయారీపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు. భారత్ తమకు చాలా ముఖ్యమైన దేశమని.. అందుకే అధ్యక్షుడు పుతిన్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ప్రధాని మోదీతో మాట్లాడారన్నారు. సమస్యల పరిష్కారంపై బీజింగ్-న్యూదిల్లీ కలిసి పని చేయడాన్ని స్వాగతించారు. చైనా మంత్రి వాంగ్‌యీ పర్యటన విజయవంతమైందన్నారు. ఇక రష్యాను శిక్షించేందుకు ఆంక్షలు విధించినవారే ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారని రోమన్ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో కుదుపులు నెలకొన్న నేపథ్యంలో వాటిని స్థిరీకరించే శక్తిగా బ్రిక్స్ ఉంటుందని రోమన్ వెల్లడిరచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను రెట్టింపు చేసి 50శాతానికి చేర్చిన నేపథ్యంలో రష్యా నుంచి స్పందన వెలువడటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో అవి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.
చమురు కొనుగోళ్ల పునరుద్ధరణ..
రష్యా ఉత్పత్తి చేసే ఉరల్స్ చమురు కొనుగోళ్లను భారత్ రిఫైనరీలు పునరుద్ధరించాయి. ఐవోసీ, బీపీసీఎల్ తాజాగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో డెలివరీలకు ఆర్డర్లు పెట్టాయి. తాజాగా మాస్కో డిస్కౌంట్లను పెంచడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. న్యూదిల్లీ నుంచి కొనుగోళ్లు పెరగడంతో.. చైనాకు సరఫరాలు తగ్గనున్నాయి. జులైలో డిస్కౌంట్లు తగ్గడంతో.. భారత సంస్థలు కొనుగోళ్లు నిలిపాయి. కానీ ఆ తర్వాత పరిణామాల్లో రాయితీ 3 డాలర్లకు పెరిగింది. తాజాగా ఆర్డర్లు పెట్టినట్లు తెలుస్తోంది.