రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) తెలిపారు. ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. రష్యాపై ఇప్పటికే జర్మనీ, బ్రిటన్ ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా రష్యా గుర్తించిన నేపథ్యంలో జో బైడెన్.. జాతినుద్దేశించి ప్రసంగించారు. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని చెప్పారు. ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాలని పుతిన్చూస్తున్నాడన్నారు. వెస్ట్ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిలిపివేశామని చెప్పారు. రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌కు అన్నివిధాలా సహాయం అందిస్తామని చెప్పారు.
కాగా, ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాతో స్నేహ సంబంధాలకు జర్మనీ కటీఫ్ చెప్పింది. రష్యా నుంచి తమ దేశానికి గ్యాస్ సరఫరాకు చేపట్టిన నార్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైప్‌లైన్ సర్టిఫికేషన్ ప్రాసెస్‌ను నిలిపివేస్తున్నట్లు జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కూల్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడుతున్న రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందని ఆరోపించారు.
రష్యాకు చెందిన కీలకమైన ఐదు బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ ప్రకటించారు. రోషియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రామ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంకులతోపాటు రష్యాకు చెందిన ముగ్గురు అత్యంత ధనవంతులపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పార్లమెంటు నుంచి ప్రత్యేక అధికారాలను కూడా పొందామన్నారు.