రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్
ప్రతిఘటనకు సిద్ధంకండి
రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ప్రతీ పైసాను ఆ దేశం నుంచే వసూలు చేస్తామని జెలెన్‌స్కీ అన్నారు. గురువారం ఆయన ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి వీడియో ప్రసంగం విడుదల చేశారు. రష్యా తప్పక మూల్యం చెల్లించుకొంటుందని పేర్కొన్నారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని చెప్పారు. ‘మీరు ధ్వంసం చేసిన ప్రతి ఇంటిని, ప్రతీ వీధిని, ప్రతీ నగరాన్ని పునర్నిర్మిస్తాం. ఇందుకయ్యే ఖర్చును మీ నుంచే వసూలు చేస్తాం’ అని రష్యాను ఉద్దేశించి అన్నారు. రష్యా ఇంకా దాడులను పెంచి ఆక్రమణకు యత్నిస్తే తాము కూడా ఎదురుదాడి చేస్తామన్నారు. రష్యా భూభాగాలపై దాడులు చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. ‘మేం కోల్పోయేది ఇక ఏం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయని చెప్పారు. ‘ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా ఏండ్ల కొద్దీ ప్రణాళికలు రచించింది. శత్రువు కుట్రలను ఉక్రెయిన్ ప్రజలు వారంలోనే భగ్నం చేశారు. ప్రతి ఆక్రమణదారు తప్పక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయాన్ని పెంచాల్సిందిగా పశ్చిమ దేశాలను మరో ఇంటర్వ్యూలో కోరారు. ఆయా దేశాలు గగన తలాలను మూసివేయాలని, లేకపోతే విమానాలు అప్పజెప్పాలన్నారు. ఇప్పుడు కలిసి పోరాడకపోతే దేవుడు క్షమించడని, రష్యా మరిన్ని ఐరోపా దేశాల మీదకు దాడులకు దిగుతుందని హెచ్చరించారు.