రసాభాసగా నెల్లూరు జడ్పీ విూటింగ్‌

సోమిరెడ్డి,కాకాణిల మధ్య వాగ్వాదం
నెల్లూరుల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): మంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిల వాగ్వాదంతో నెల్లూరు జిల్లా పరిషత్‌ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో భాగంగా జిల్లాలో కరువు, సాగునీటి అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా కనుపూరు కాలువ పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందని, పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి… ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని, నిబంధనల ప్రకారమే పనులు జరగుతున్నాయని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి సమాధానం పూర్తికాక ముందే ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వేంతంటే, నువ్వెంతంటూ మంత్రి, ఎమ్మెల్యేలు వాదులాటకు దిగారు. ఇరువురిని సముదాయించేందుకు జడ్పీ ఛైర్మన్‌ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మంత్రి, ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో ఛైర్మన్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. కావలి చెరువు విషయంలోనూ ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు, ఎమ్మెల్యేకు మధ్య కాస్త వాగ్వాదం సాగింది. జిల్లాలో కరువు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. పంటలు పండటం ఇష్టం లేకే వైకాపా ఎమ్మెల్యేలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాజావార్తలు