రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడి

న్యాయబద్ధంగా పనులు చేశాం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు
రాష్ట్రం అభివృద్ధి బాటపడుతుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నరు
ఈ దాడులను మనమంతా తిప్పికొట్టాలి
కాంగ్రెస్‌ సర్కారును రాసిస్తే మళ్లీ కష్టాలు వస్తాయ్‌..
ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు
ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై దాడి తనపై దాడిగా భావిస్తున్నట్టు వ్యాఖ్యలు
జుక్కల్‌/కామారెడ్డి బ్యూరో/నారాయణఖేడ్‌ (జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కత్తులతో దాడి చేశారని ధ్వజమెత్తారు. సమస్యలపై యుద్ధం చేస్తున్నామని, కానీ శత్రువులను సైతం ఇబ్బందిపెట్టలేదని చెప్పారు. కర్ణాటకలో కరెంటు సరిపోక రైతులు పురుగుల మందు తాగి చనిపోతామంటున్నారని, పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఎలాంటి దుస్థితి ఉందో కూడా మీకందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, అందుకే కత్తులతో దాడులకు తెగబడుతున్నారని అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌, బాన్సువాడ, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘నాకు కొంచెం మనసు బాగా లేదు. కారణం ఏంటంటే మనం ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్తున్నాం. చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చాతగాని వెదవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారు. ఇంతకుముందే హైదరాబాద్‌కు తరలించారు. నేను జుక్కల్‌లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడికి హరీశ్‌రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్‌రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదు. విూ కార్యక్రమం ముగించుకొని రండి విూమంతా ఉన్నాం.. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది. కానీ, ఇది రాజకీయమా? అరాచకమా? అంటూ ధ్వజమెత్తారు. మనస్సు భారంగా ఉన్నా.. కనీసం కనబడి నమస్కారం పెట్టి పోదామని చెప్పి ఇంత దూరం వచ్చానని నారాయణ్‌ఖేడ్‌లో ఆయన అన్నారు. హైదరాబాద్‌ వెళ్లి ప్రభాకర్‌ రెడ్డి పరామర్శించాలి. అన్యత భావించొద్దు.. ఎన్నికల అనంతరం విూకు కావాల్సినవన్నీ మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. నారాయణఖేడ్‌ చరిత్రలోనే మంచి నాయకుడు ఉన్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు.
అక్కడికి.. ఇక్కడికి ఎంతో తేడా..
జుక్కల్‌లో సభలో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు ముంబై సిటీ ఉన్నదని, అది హైదరాబాద్‌ కంటే పెద్దదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అయినప్పటికీ అక్కడ నిత్యం 8 నుంచి 11 మంది రైతులు చనిపోతున్నారని సీఎం తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల్లో రైతులను పట్టించుకునే నాథుడే లేడని చెప్పారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదన్నారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎంపీ బీబీ పాటిల్‌ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హన్మంత్‌ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్‌ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.
నిజాంసాగర్‌ ఎప్పుడూ నిండు కుండలా..
కరువు కాటకాలతో అల్లాడిన జుక్కల్‌ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. జుక్కల్‌ నియోజకవర్గానికి లెండి ప్రాజెక్టు రావాల్సి ఉన్నదని, ఎన్నికల తర్వాత మహారాష్ట్ర వాళ్లతో మాట్లాడి లెండి ప్రాజెక్టు సంగతి తేలుస్తానని హావిూ ఇచ్చారు. నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను షిండే పట్టుబట్టి సాంక్షన్‌ చేయించుకున్నారని, దాని ద్వారా వచ్చే వర్షా కాలానికి జుక్కల్‌లో 40 వేల ఎకరాలకు సాగు నీళ్లు వస్తయని చెప్పారు. ‘ఇక నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా ఉంటది. కాళేశ్వరం నీళ్లతో నిజాంసాగర్‌ను నింపుతున్నం. ఇక్కడి కరువును చూసి ఒకప్పుడు జుక్కల్‌కు పిల్లను ఇవ్వాలంటే భయపడేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 24 గంటల కరెంటు, సాగు నీటి వసతుల వృద్ధి కారణంగా నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దేశంలో దళిత బంధు పథకాన్ని సృష్టించిందే బీఆర్‌ఎస్‌ సర్కారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నం. రైతులు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ పథకం తోడ్పాటును అందిస్తున్నం’ అని సీఎం తెలిపారు.