రాజకీయ లాభాల కోసం..
ప్రజల్లో అశాంతికి కుట్రలు జరుగుతున్నాయి
– రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలి
– పార్లమెంట్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజారనివ్వద్దు
– ముస్లిం ఓట్ల తొలగింపును ప్రతిఘటించండి
– ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి , ఆగస్టు3(జనం సాక్షి) : రాజకీయ లాభాల కోసం ప్రజల్లో అశాంతి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్షాలపై మండిపడ్డారు. తెలుగుదేశం ఎంపీలతో సీఎం ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముస్లిం ఓట్ల తొలగింపును ప్రతిఘటించాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో ప్రతి అవకాశం వినియోగించుకోవాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలని కోరారు. ఇంతవరకూ చేసిన పోరాటంపై ప్రజల్లో సంతృప్తి ఉందన్న సీఎం.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలన్నారు. చట్ట ప్రకారం ఏపీ హక్కులు నెరవేర్చాలని, ప్రజలు కోరుకున్నది ప్రతినిధులు సాధించాలని సూచించారు. అసోం, జమ్ముకశ్మీర్, పశ్చిమ్ బంగా రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దురదృష్టకరమని సీఎం అన్నారు. భాజపా ఒంటెత్తు పోకడలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలబడాలన్నారు. ట్రిపుల్ తలాక్‌పై కూడా అప్పట్లో ఇలాగే చేశారన్న చంద్రబాబు అన్నారు. సున్నితమైన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం మంచిది కాదని, భావోద్వేగాలతో ఆడుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు. ఏ అంశంపైన అయినా చర్చ జరిగి, ఏకాభిప్రాయం సాదించాలన్నారు. త్రిసభ్య సంఘంతో ఎంపీలు సమన్వయం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి.. కుటుంబరావు, బాల సుబ్రహ్మణ్యం, ప్రేమచంద్ర రెడ్డి తో సంప్రదించాలని ఎంపీలకు దిశానిర్దేశంచేశారు.