రాజకీయ సంక్షోభంతో తెలంగాణ సాధిద్దాం
నవంబర్ 1 విద్రోహదినం
తెలంగాణ మంత్రులు పాల్గొనవద్దు
తెలంగాణ కోసం నిలబడ్డవారికే భవిష్యత్తు
ఎర్రబెల్లి, గీతారెడ్డికి తెలంగాణ సెగ
సాగరతీరాన అలాయ్‌బలాయ్
హైదరాబాద్, అక్టోబర్ 25 (జనంసాక్షి):
రాజకీయ సంక్షోభంతోనే తెలంగాణ సాధిద్దామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. హుస్సేన్ సాగర్ తీరాన గల జలవిహార్‌లో గురువారం జరిగిన అలాయ్ బలాయ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం అన్ని పార్టీల నాయకులు ఏకం కావాలన్నారు. నవంబర్1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని ఆయన కోరారు..ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలలో మంత్రులు ఎవరూ పాల్గొన వద్దన్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు తెలంగాణపై స్పష్గమైన వైఖరి లేదని, తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే వారికి భవిష్యత్తు లేదన్నారు. అన్ని పార్టీల తెలంగాణ నేతలు కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు..తెలంగాణ కోసం నిలబడ్డ వారికే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.ప్రతి దసరా
రోజు బీజేపీ జాతీయ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం ప్రముఖులు రాక సందడిగా మారింది. గురువారం ఈ వేడుకలో బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో పాటు మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.కేశవరావ్, రాజ్యసభ్యుడు వి.హనుమంతురావు, ఎంపీ మధుయాష్కీ, రాజయ్య, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి, టిఎన్‌జివో నాయకులు దేవీ ప్రసాద్, విఠల్, శ్రీనివాస్ గౌడ్‌తోపాటు ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. వచ్చిన నేతలందరూ దత్తాత్రేయతో అలయ్ బలయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జలవిహార్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబిస్తూ పలు కళారూపాలను ప్రదర్శించారు. జానపద కళాకారులు తమ తమ బృందాలతో చేరుకుని అలయ్ బలయ్ ఆద్యంతం రసవత్తరంగా మార్చి తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. అలాయ్ బలయ్‌లో తెలంగాణ సంప్రదాయ ఆహారపదార్ధాలను ఏర్పాటు చేశారు. తెలంగాణకు ప్రత్యేకమైన అంబలిని ఆహుతులకు అందజేశారు. పలు రకాల తెలంగాణ ఆహారపదార్థాలతో విందు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో నేతల ప్రసంగాలు పూర్తిగా తెలంగాణ లక్ష్యంగానే సాగాయి.
ఒకానొక సందర్భంలో మంత్రి గీతారెడ్డి, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగిస్తుండగా వారికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. గీతారెడ్డి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై టిడిపి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎర్రబెల్లిని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, టిడిపి గో బ్యాక్ అంటూ సభలో నినాదాలు చేశారు. దీంతో వారిని దత్తాత్రేయ వారించారు. ఇక్కడికి చేరిన వారి అందరి లక్ష్యం తెలంగాణ సాధనే అని ఆయన చెప్పారు. సంప్రదాయ వేడుకల్లో సమస్యలు లేకుండా సంతోషంగా గడుపుదామని ఆయన అన్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తమ పార్టీ నిర్ణయాన్ని తప్పకుండా వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి అధిష్టానాన్ని ఒప్పిస్తామన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో తాము ఏ నిర్ణయం తీసుకుంటామో మీరే వేచి చూడాలని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇకనైనా మోసపూరిత ప్రకటనలు మానుకోవాలని తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు మాట్లాడుతూ 20మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుంటే తెలంగాణ తప్పక వస్తుందని అన్నారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నేతలలో ఐక్యత అత్యంత అవసరమని చెప్పారు. నేతలంతా ఏకమైతే చంద్రబాబు తెలంగాణలో తిరగగలిగేవారా అని ప్రశ్నించారు. ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ ఎన్నికల ముందు కేంద్రం తెలంగాణ ప్రకటిస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న, అడ్డుకుంటున్న సీమాంధ్రనేతల ఆస్తులకు ప్రజాస్వామ్యబద్ధంగా సెగపెడితేనే తప్ప తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా సాయంత్రం వరకు సాగిన అలయ్ బలయ్ ఎంతో అలరించింది.