రాజధాని వికేంద్రీకరణ జరిగి తీరుతుంది

అన్నిప్రాంతాలను వైసిపి సమానంగా చూస్తుంది
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పెట్టిందే అమరావతి
జగనన్న గృహహక్కు పథకాన్ని ప్రారంభోత్సవంలో మంత్రి నాని
విజయవాడ,డిసెంబర్‌21 ( జనం సాక్షి): రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ జరిగి తీరుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పెట్టిన రాజధాని అమరావతి అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వైసీపీ ప్రభుత్వానికి ఒక్కటేనని చెప్పారు.సెక్రటేరియట్‌ వైజాగ్‌లో ఏర్పాటు చేయాల్సిందే, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదన్నారు. మంగళవారం గుడివాడలో జగనన్న గృహహక్కు పథకాన్ని ప్రారంభించి, లబ్దిదారులకు రిజిష్టర్‌ దస్తావేజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జె.నివాస్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఉప్పాల హరిక, ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే రాజధాని వికేంద్రీకరణ అని తెలిపారు. అమరావతి అందరిదీ అన్న పెద్దలు, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వేంకటేశ్వరస్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారన్నారు. 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చెయాలనే నాడు ప్రతి పక్షనేతగా జగన్మోహన్‌ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కొడాలి నాని సవాల్‌ విసిరారు.తనకు చెందిన వారికి లబ్ది చేకూర్చేందుకే ల్యాండ్‌ పులింగ్‌ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుట్టిన రోజు నాడు జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు ఆశీస్సులు అందించాలని మంత్రి కొడాలి నాని కోరారు.