రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యం

 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డియేనని మండిపడింది. తెలంగాణ భూములు అమ్ముకున్న పార్టీ వైఎస్సార్‌ సీపీ అని, పార్లమెంట్‌లో సమైక్యవాద ప్లకార్డును పట్టుకున్న దుర్మార్గుడు జగనేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ విమర్శించారు. రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యమని, దోపిడీ రాజ్యమేనని ఎద్దేవా చేశారు. శనివారం టీఆర్‌ఎస్‌భవన్‌లో ఈటెల విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతికి పాల్పడిన దుర్మార్గుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాడని, ఇష్టమొచ్చినట్లు భూములు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే మాట మార్చి సమైక్యవాదం వినిపించాడని, హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసాలు అడుగుతారేమోనంటూ తన కుటిల బుద్దిని బయటపెట్టుకున్నారని విమర్శించారు. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా తెలంగాణ రాకుండా అడ్డు పడ్డాడని ఈటెల మండిపడ్డారు. పార్లమెంట్‌లో సమైక్య ప్లకార్డులు పట్టుకొని వచ్చిన తెలంగాణ వెనక్కు పోయేలా చేశారన్నారు. తెలంగాణ భూములను దోచుకుని ఆయన పెట్టిన వైఎస్సార్‌ సీపీని తెలంగాణవాదులు ఆదరించబోరన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి స్థానం లేదని పరకాల ఎన్నికతో స్పష్టమైందన్నారు. సీమాంధ్ర పార్టీలను తెలంగాణ ప్రజలు అంగీకరించరన్నారు. కాంగ్రెస్‌ చచ్చిపోయిన పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిందని, ఆ పార్టీకి ఇక నూకలు చెల్లినట్లేనన్నారు. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడే పార్టీ టీఆర్‌ఎస్సేనని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువుల, శాశ్వత మిత్రులు ఉండరని ఓ ప్రశ్నకు సమాధానంగా ఈటెల

బదులిచ్చారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజలను టీఆర్‌ఎస్‌ ఐక్యం చేయగలిగిందన్నారు. ప్రజలు ఐక్యంగానే ఉన్నారని, ఇక ఐక్యం కావాల్సింది రాజకీయ వ్యవస్థ మాత్రమేనని చెప్పారు. అందరినీ ఐక్యం చేసే బాధ్యత టీఆర్‌ఎస్‌దేనన్నారు. టీఆర్‌ఎస్‌కు ముగ్గురే ప్రధాన శత్రువులు ఉన్నారని, అవి కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీలేనని చెప్పారు. వాటికి తెలంగాణలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.