రాజమహేంద్రికి పర్యాటక శోభ
గోదావరి ఫెస్టివల్‌కు సన్నాహాలు
రాజమహేంద్రవరం,సెప్టెంబర్26(జనంసాక్షి): రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో గోదావరి ఫెస్టివల్ నిర్వహించాలన ఇయోచిస్తున్నారు. గతంలో మాదిరగానే ఈ యేడు కూడా దీనికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. దీంతో గోదావరి తీరాన దసరా వేడుకలు అలరించనున్నాయి. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర పండుగల పేరుతో ఆయా సందర్భాల్లో రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌లో కాకినాడలో సాగర్ ఉత్సవాలు నిర్వహిస్తుండగా, జనవరిలో కోనసీమ వేడుకలు నిర్వహిస్తున్నారు. అదే నెలలో మన్యం జాతర పేరుతో పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే దసరా ఉత్సవాలను రాష్ట్రంలో గోదావరి తీరాన నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గతేడాది గోదావరి డ్యాన్స్ అండ్ లైటింగ్ పేరుతో పండుగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. పుష్కరాలకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన
రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్ వద్ద వేడుకలు నిర్వహించనున్నారు. ప్రఖ్యాత సంగీత కళాకారులు గాయనీ గాయకులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకోసం కోటిలింగాల ఘాట్ వద్ద గోదావరి నీటి అలలపై తేలియాడే వేదికను ఏర్పాటు చేశారు. కళాకారులకు వెనుక హౌస్ బోట్‌లను ఏర్పాటు చేసారు. గోదావరి అఖండ హారతిలో ప్రారంభమయ్యే వేడుకల్లో సంప్రదాయ నృత్యాలు, మన సంస్కృతి ప్రతిబంబించే విధంగా కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుద్దీపాలంకరణ, ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. దీంతో రాజమహేంద్రి కొత్త సొబగులను సంతరించుకోనుంది.