రాజాజీ హాల్‌ వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు

రాజకీయ సినీ ప్రముఖుల రాకతో సందడి

పోలీసులకు తలనొప్పిగా మారిన అభిమానుల రాక

కంట్రోల్‌ చేసేందుకు స్వల్ప లాఠీఛార్జ్‌..ఉద్రిక్తత

చెన్నై,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు రాజాజీ హాల్‌కు భారీగా చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడికి కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. వీఐపీలు, ప్రముఖులు రాకతో రద్దీ అడ్డుకోడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజాజీ హాల్‌ సవిూపంలో భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కడసారి చూసేందుకు ప్రముఖులు, ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం కరుణానిధి పార్థివదేహాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాళు లర్పించారు. చెన్నైలోని రాజాజీ మెమోరియల్‌లో ప్రజల సందర్శన కోసం ఉంచారు. అయితే తమ ప్రియతమ నేతను చివరిసారి చూసేందుకు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. రాజాజీ హాల్‌ చుట్టూ లక్షల్లో అభిమానులు చేరుకున్నారు. బ్యారికేడ్లను ఎక్కి జనం .. హాల్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఉప్పెనలా వస్తున్న అభిమానుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీఎంకే నేతలు కూడా అభిమానుల్ని శాంతిపచేస్తున్నారు. రాజాజీ హాల్‌ పక్కన ఉన్న గవర్నర్‌ హాస్పటల్‌ ఎక్కి మరీ.. కరుణ పార్ధీవదేహాన్ని చూసేందుకు జనం వస్తున్నారు. సంయమనం పాటించాలని చెన్నై మాజీ మేయర్‌ సుబ్రమణ్యం ప్రజలను కోరారు. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించారు. పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరుణానిధికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తతమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబంతో సహా వచ్చి కలైంజ్ఞర్‌కు నివాళులర్పించారు. సూర్య, ఆర్య తదితరులూ కరుణకు పుష్పాంజలి ఘటించారు. తమిళనాడులోని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర వర్గాలకు చెందిన ప్రముఖులు కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించారు. కరుణానిధి పార్థివదేహం వద్ద కుమారులు అళగిరి, స్టాలిన్‌, కుమార్తె కనిమొళి ఉన్నారు. కరుణానిధి అంత్యక్రియలు సాయంత్రం మెరీనా బీచ్‌లో జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు రాజాజీహాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది. అనంతరం మెరీనా బీచ్‌లో ప్రభుత్వలాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో డీఎంకే నేతలు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొననున్నారు.