రాజీనామా లేఖను సోనియాకు పంపిన రాజగోపాల్
విధిలేకనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్,అగస్టు4(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ రాజీనామా లేఖను గురువారం కాంగ్రెస అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు.. ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే 8వ తేదీకి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ స్పీకర్‌ను కోరారు. ఆ రోజు సభాపతికి రాజీనామా లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం. తన నియోజకవర్గమైన మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఉప ఎన్నిక జరిగితేనే నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందనే ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అరాచకపాలన పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌పై పోరాడలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధతోటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన… స్పీకర్ అపాయింట్‌మెంట్ తీసుకుని రాజీనామా లేఖను అందజేస్తానని వెల్లడిరచారు. సోనియాపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం బాధకలిగించిందన్నారు. మరోవైపు ఈ నెల 8న రాజగోపాల్ రెడ్డికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చారు.ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. హస్తం నేతలు బుజ్జగింపులు.. సంప్రదింపులు జరిపినా అవి ఫలించలేదు. మునుగోడు ఎమ్మెల్యే పదవీకి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం అధికారికంగా స్పీకర్ ను కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.