రాజ్యసభలో నోటాకు స్థానం లేదు

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు

నోటా ప్రత్యక్ష ఎన్నికలకే పరిమితం అన్న సుప్రీం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): రాజ్యసభ ఎన్నికలకు నోటా ఆప్షన్‌ వర్తించబోదని సుప్రీంకోర్టు సంచలన తేల్చిచెప్పింది. ఈ మేరకు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషన్‌ జారీచేసిన నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా ధర్మాసనం పక్కనబెట్టింది. నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ఎన్నికల సంఘం అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ గుజరాత్‌ అసెంబ్లీలోని కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ శైలేష్‌ మనుభాయ్‌ పార్మర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నోటా సదుపాయాన్ని అనుమతిస్తే రాజ్యసభ ఎన్నికల్లో అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుందని పార్మర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను తోసిపుచ్చింది. ప్రజలు నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. దీనికితోడు ఇక్కడ ఓటు వేసేది ప్రజాప్రతినిధులు కావడం విశేషం. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే ఈ నోటా సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని 2013లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో అప్పటి నుంచి ఈ నోటాను ఎన్నికల సంఘం అభ్యర్థుల జాబితాలో చేర్చింది. అయితే ఈ నోటా ఓట్లను పెద్దగా పరిగణించడం లేదు. నోటా ఓట్లు పోల్‌ అవుతున్నప్పటికీ.. ఒక అభ్యర్థికి కనీస మెజార్టీ ఓట్లు వస్తే ఆయన్నే విజేతగా ప్రకటిస్తున్నారు. రాజ్యసభలో దీనిని ప్రవేశం సరికాదని ఆయన కేసు వేయడంతో విచారించిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.