రాజ్యసభ చైర్మన్‌కు క్షమాపణ చెప్పిన..  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి


న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం చైర్మన్‌ వెంకయ్య నాయుడకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో సమయం అయిపోయిందంటూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఇలాచేస్తే సభ నుంచి వాకౌట్‌ చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఆయన వైఖరిపై అధికార, విపక్ష సభ్యులందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్‌ గోయల్‌ మాట్లాడుతూ.. మంగళవారం ఘటనకు సంబంధించి ఛైర్మన్‌కు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు కాంగ్రెస్‌ సభ్యుడు ఆజాద్‌ సహా ఇతర పార్టీల సభ్యులు మద్దతు పలికారు. విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో విజయసాయి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన్ని వారించారు. సభలో సమయం కేటాయించడం తన విధి అని.. సమయం సరిపోకపోతే పొడిగించాలని విజ్ఞప్తి చేయాలే తప్ప ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదని సూచించారు. మంగళవారం ఘటనపై వివరణ ఇవ్వాల్సిన పనిలేదని, తనకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం ఆజాద్‌ మాట్లాడుతూ.. ఛైర్మన్‌పై అమర్యాదకరంగా ప్రవర్తించిన విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. దీంతో సభలో మంగళవారం నాటి పరిణామాలకు తాను క్షమాపణ చెబుతున్నట్లు విజయసాయి ప్రకటించారు.