రాజ్యాంగాన్ని తగులబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

మచిలీపట్టణంలో కెవిపిఎస్‌ ఆందోళన

విజయవాడ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను తగలబెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్‌ ) ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్‌ వద్ద గురువారం కెవిపిఎస్‌ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘం రాష్ట్ర నాయకులు రాజేశ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టేనన్నారు. యాక్టు 4 (ఎ) కింద సెక్షన్‌ 2 ప్రకారం జాతీయ చిహ్నాలకు అవమానం కలిగిస్తే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఆర్టికల్‌( 51) ప్రకారం ప్రతి పౌరుడు రాజ్యాంగానికి విధేయులు కావాలని చెప్పారు. ఉన్మాద మూకలు రాజ్యాంగాన్ని తగలబెడుతూ వారే దేశాన్ని రక్షించండి అని నినాదాలు చేస్తుంటే..దాన్ని మించిన దేశ ద్రోహం మరేది లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తగలబెట్టి అవమానించిన ఉన్మాద మూకలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘం రాష్ట్ర నాయకులు రాజేశ్‌, జిల్లా కార్యదర్శి సాల్మన్‌, డివిజన్‌ అధ్యక్షుడు పేటేటి రాజు, లాయర్‌ వి.కోటేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు కె.శర్మ, దళిత జెఎసి నాయకులు వినోదరావు, రమేశ్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు