రాజ్యాంగ సంస్థలపై భాజపా జోక్యం ఆక్షేపనీయం
` మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ సరికాదు
` 2011లోనే సస్పెండ్ చేసిన రొడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే..
` మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదు..అందుకే ఆ పార్టీ అడ్డదారులు : కేటీఆర్
` రాజ్యాంగ వ్యవస్థలను భాజపా దుర్వినియోగం చేస్తుందనడానికి ఒక మరో తార్కణమని వ్యాఖ్య
` ఎన్నికల కమిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజం
హైదరాబాద్(జనంసాక్షి): మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు.2011లోనే సస్పెండ్ చేసిన రొడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని పేర్కొన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని నిప్పులు చెరిగారు.ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ జాతీయ నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పని చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.అంతకుముందు మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తూ .ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో జగన్నాథరావుపై వేటు వేశారు. నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో.. ఆర్వో వివరణ తీసుకొని నివేదిక పంపాలని సీఈవోకు ఆదేశాలిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్రులకు గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. రోడ్డు రోలర్ గుర్తును మొదట పొందిన అభ్యర్థికి తిరిగి కేటాయించాలని బుధవారం మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. చంచల్‌గూడలో బ్యాలెట్ ప్రింటింగ్‌కు నల్లగొండ జిల్లా అధికారులు వెళ్లగా ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని, రోడ్డు రోలర్ గుర్తును జతచేసి కొత్తగా ప్రింట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలావుంటే మునుగోడు గుర్తులపై స్పష్టత లేక అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. రోడ్ రోలర్ గుర్తు కేటాయింపులో వివాదం చోటుచేసుకుంది. ఉపఎన్నికపై ఎన్నికల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మునుగోడు ఆర్‌ఓ నిర్ణయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. గుర్తులను ఫైనల్ చేయాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మునుగోడు నియోజవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కీలక ప్రాంతాల్లో అడుగడుగున తనిఖీలు చేపట్టాయి. డబ్బు, మద్యం డంప్ కాకుండా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, పంతంగి టోల్ ప్లాజా దగ్గర కేంద్ర బలగాలు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందన్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే మునుగోడు శివారు ప్రాంతాలతోపాటు యాదాద్రి, నల్గొండ జిల్లాలో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధుల వాహనాలు కూడా కేంద్ర బలగాలు తనిఖీలు చేస్తున్నాయి.