రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలి

రాజ్యాంగ దినోత్సవంలో జాయింట్‌ కలెక్టర్‌

శ్రీకాకుళం,నవంబర్‌26(జ‌నంసాక్షి): భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ కెవిఎన్‌.చక్రధర బాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని పాటించాలన్నారు. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగంలో ముఖ్యంగా లౌకికవాదాన్ని ప్రబోధిస్తూ.. ఏ కులమైనా, మతమైనా దేశంలో సమానమే అని స్పష్టంగా చెప్పబడిందని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించిందని, ఎవరి హక్కునూ ఎవరూ కాల రాయకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం నాంది, మార్గదర్శి అని పలికారు. రాజ్యాంగం ఆదేశాల మేరకు.. ప్రజాస్వామ్య మనుగడ కొనసాగుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరునికి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. సమ న్యాయం, సోదర భావం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా రాజ్యాంగంలో చేర్చారని ఉద్ఘాటించారు. దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆశయాలను పొందుపరుస్తూ రాజ్యాంగాన్ని తయారు చేశారన్నారు. ఉద్యోగులందరూ విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో పనిచేసి, ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌-2 పి.రజనీకాంతరావు మాట్లాడుతూ.. రాజ్యాంగం పవిత్రమైందని, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్‌.బిఆర్‌.అంబేద్కర్‌ తయారు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.నరేంద్ర ప్రసాద్‌, డివిజనల్‌ అటవీ అధికారులు బి.ధనుంజయ రావు, సిహెచ్‌. శాంతి స్వరూప్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి బి.నగేష్‌, రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ కె.కాంతిమతి, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌డి.అనిత, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.చెంచయ్య, సర్వ శిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ అధికారి ఎస్‌.త్రినాధ రావు, బిసి కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కెవి.ఆదిత్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.