రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంలో పిటిషన్‌

– వచ్చే వారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని మహా రాఫెల్‌ దోపిడీగా పేర్కొన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. దీనిపై సమాధానం చెప్పాలంటూ పలుసార్లు భాజపాపై ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. ఈ రాఫెల్‌ ఒప్పందంపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం వచ్చేవారం విచారణ చేపట్టనుంది. భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య జరిగిన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనేక అవకతవకలు ఉన్నాయని, ఈ ఒప్పందంపై స్టే విధించాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఇందుకు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. వచ్చే వారం దీనిపై విచారణ చేపడుతామని తెలిపింది. రాఫెల్‌ ఒప్పందం ఓ వ్యక్తికి లాభం చేకూర్చేలా జరిగిందంటూ గత కొంతకాలంగా రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి కుంభకోణం జరగలేదని, కాంగ్రెస్‌ కావాలనే అసత్య ప్రచారాలు చేస్తోందని భాజపా వాదిస్తోంది.