రామతీర్థం ఘటనలో అశోకగజపతిపై కేసు

ఇవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
విజయనగరం,డిసెంబర్‌23 (జనం సాక్షి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బుధవారం నాటి ఘటనల ఆధారంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా అశోకగజపతి రాజు విధులకు ఆటంకాలు కల్పించారంటూ ఇవో కేసు నమోదు చేయడంతో మరోమారు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తనకు సమాచారం లేకుండా బోడికొండపై రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకోవడంపై దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేవదాయ శాఖ అధికారులపై, అధికార పక్షంపైనా తీవ్రంగా మండిపడి.. స్టీలు రేకు శిలాఫలకాన్ని
విసిరేశారు. దీంతో ఆయనకు, వైసీపీ నాయకులకు మధ్య బుధవారం తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో కొండపై గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం అంతా బుధవారం హాట్‌ టాపిక్‌గానే నడిచింది. తప్పంతా అశోక్‌దేనని వైసీపీ.. చేసిందంతా వైసీపీ మంత్రులేనని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే.. ఈ ఘటనపై ఆలయ ఈవో ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంఖుస్థాపన ఏర్పాట్లు వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అశోక్‌ గజపతితో పాటు మరికొందరిపైన కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్‌ గజపతికి ఎలాంటి ప్రోటోకాల్‌ ఉల్లంఘన జరగలేదని కూడా ఈవో ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అశోక్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలోనే ఈవోతో పాటు పలువురు ఆలయ అధికారులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఏమున్నది అనే విషయం పోలీసులు బయటికి చెప్పకపోగా.. గురువారం నాడు ఇదంతా బయటికొచ్చింది. కోదండరాముని ఆలయం వ్యవహారం పూర్తిగా మాన్సాస్‌ ట్రస్టుకు
సంబంధించిన అంశమని, ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదని ట్రస్టు చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. ఆలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తిచేసిన తరువాత తనకు చెప్పడం బాధాకరమన్నారు. అది తమ పూర్వీకులు 400 సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయమని గుర్తు చేశారు. గతంలో తాను విరాళం ఇచ్చిన చెక్కును కూడా ఈవో స్వీకరించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అయితే రామతీర్థం కొండపై జరిగిన ఘర్షణలకు సంబంధించి అశోక్‌ గజపతిరాజుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు ఆలయ ధర్మకర్త అశోక్‌పై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. ఆస్తి ధ్వంసం, గందరగోళం సఅష్టించారని కేసులు నమోదయ్యాయి.