రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తా

ప్రజల సమస్యలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి
– యువకుల్లో ప్రశ్నించేతత్వం రావాలి
– నా మనసుకు మాత్రం కర్నూలే రాజధాని
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
కర్నూలు, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రాయలసీమలో ఎందరో గొప్ప నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, రాయలసీమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా తాను కృషిచేస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులతో మాట్లాడారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు, వైద్య, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తమ సమస్యలను పవన్‌కు వివరించారు. వైద్య విద్యార్థులు ఆర్‌ఎంపీ విధానాన్ని రద్దు చేయాలని పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష ¬దాలో ఉన్న జగన్‌కు ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనమని పవన్‌ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లకపోవడం వల్ల..సమస్యలు మరింత పెరుగుతున్నాయన్నారు. తాను ఓట్లు అడగడానికి రాలేదని, మార్పు కోసమే వచ్చానన్నారు. ప్రజల సమస్యలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని చెప్పారు. యువకుల్లో ప్రశ్నించే ధైర్యం ఉండాలన్నారు. మనకి రాజధాని అమరావతి అయినా.. తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని పవన్‌ వ్యాఖ్యానించారు. అమరావతిని మించిన నగరంగా కర్నూలును తాను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎందరో రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారని, తాను రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తానని హావిూ ఇచ్చారు. కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. మోసం చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం అంటే తనకు ఇష్టమని అన్నారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, కర్నూలును రాజధానిని మించిన నగరంగా నిర్మిస్తామని పవన్‌ హావిూ ఇచ్చారు. జనసేన ప్రభుత్వంలో మండలానికో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.