రాయల్పాడు సీఐ తీరుపై.. చంద్రబాబు ఆగ్రహం
– క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశం!
– బాధితురాలికి అండగా ఉంటామని సీఎం హావిూ
చిత్తూరు, సెప్టెంబర్19(జనంసాక్షి) : చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సీఐ తేజోమూర్తి లైంగిక వేధింపుల వ్యవహారంపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బుధవారం ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు బాధితురాలికి తన ప్రభుత్వం అండగా ఉంటుందనీ, భయపడవద్దని సూచించారు. తేజోమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను సీఎం ఆదేశించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడంపై మదనపల్లెకు చెందిన సంయుక్త అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బాధితురాలిపై కన్నేసిన స్టేషన్ సీఐ తేజోమూర్తి తన కోరిక తీర్చాలని వేధించాడు. తిరుమల కొండపై తాను విధులు నిర్వహిస్తున్నాననీ, వస్తే ఇద్దరం కలసి ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాడు. ఈ వేధింపులు హద్దులు దాటడంతో సంయుక్త మహిళా సంఘాలతో కలసి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ వెకిలి చేష్టలకు సంబంధించి ఆడియో, వీడియో, మెస్సేజ్‌లను బహిరంగం చేసింది. వీటిని పరిశీలించిన డీఐజీ శ్రీనివాస్ తేజోమూర్తిని సస్పెండ్ చేశారు. కాగా బాధిత మహిళల మాట్లాడుతూ సీఐతో పాటు మరికొందరు తనను వేధింపులకు గురిచేశారని, తను కేసును తీసుకొనేందుకు వెనుకాడారన్నారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని బాధిత మహిళ కోరింది