రాష్ట్రంలో ప్రస్తుతం ‘బీరు.. మీరు’ సుడిగుండంలో ప్రజలు

పట్టించుకునేవారే కరువు

రుణమాఫీ చేస్తానంటే జంకుతున్న కాంగ్రెస్‌, వైఎస్సార్‌ సీపీ నేతలు

మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు

మెదక్‌, నవంబర్‌ 24 : ‘మా పాలనలో నీరు.. మీరుతో ప్రజల సమస్యలను పరిష్కరించాం. ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో ‘బీరు.. మీరు’తో ప్రజలను సుడిగుండంలోకి నెట్టివేస్తున్నారు’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ‘వస్తున్నా.. మీ కోసం’లో భాగంగా శనివారం తన పాదయాత్రను మెదక్‌ జిల్లాలో కొనసాగించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌ మండల కేంద్రం, ఇబ్రహీంపూర్‌ గ్రామాలలో జరిగిన సభలలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అస్తవ్యస్త పాలన నెలకొందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. వైఎస్‌ కుటుంబం నుంచి అవినీతికి  పాల్పడిన సొమ్మును రికవరీ చేసి మూడు సార్లు రైతులకు రుణ మాఫీ చేస్తానంటే కాంగ్రెస్‌, వైఎస్సార్‌ సీపీ నేతలకు వణుకుపుడుతోందని అన్నారు. రుణ మాఫీ ఎలాచేస్తారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2500 కోట్లతో మైనారిటీ సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. లక్ష రూపాయలతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. మెదక్‌ జిల్లాలో మంజీర , సింగూర ప్రాజెక్టులున్నా తాగటానికి గుక్కెడు మంచినీరు లేదని, కాని బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీటిని తరలిస్తున్నారని అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల మొత్తాన్ని, పింఛన్ల డబ్బులను కాంగ్రెస్‌ పెద్దలు దోచుకుంటున్నారని ఆయన అన్నారు.  రైతుల, విద్యార్థుల గ్రామ ప్రజల కష్టాలు తెలుసుకుని  తాను అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మీ ఇంటిలో పెద్దన్నగా ఉంటానన్నారు. తాను హిందూపూర్‌లో ప్రారంభించిన పాదయాత్ర నేటికీ 54వ రోజుకు చేరుకుందన్నారు.

కాగా ఇబ్రహీంపూర్‌లో గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ పావలా వడ్డీ గురించి ఆరా తీశారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇస్తున్నామని ప్రకటిస్తున్నా మహిళల నుంచి రూపాయి నుంచి రెండు రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని పలువురు మహిళలు బాబు దృష్టికి తీసుకువచ్చారు. అధైర్యపడకండి మా పాలనలో అన్ని చక్కదిద్దుతా అంటూ వారికి భరోసా ఇచ్చారు. వికలాంగులకు 1500 రూపాయలు పింఛన్‌ ఇవ్వాలని బాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేతికాని తనం వల్లే తాను పాదయాత్రకు పూనుకున్నట్టు బాబు తెలిపారు. ఇబ్రహీంపూర్‌ సమీపంలోని పత్తి పంటను పరిశీలించారు. ప్రస్తుతం పత్తికి గిట్టుబాటు ధర లేదని, తాము అధికారంలోకి వస్తే పత్తి, చెరకు, వరికి గిట్టుబాటు ధర కల్పిస్తానన్నారు. నారాయణఖేడ్‌ నుంచి జహీరాబాద్‌కు ఎండ్లబండ్లపై వెళుతున్న బాటసారులను బాబు పలకరిస్తూ ముందుకుసాగారు.