రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు విస్తృత అవకాశాలు

– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణది తొలిస్థానం
– పరిశ్రమలకోసం దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అనుమతులు
– రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం
–  వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్‌
న్యూఢిల్లీ, నవంబర4(జ‌నంసాక్షి): తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ తొలిస్థానంలో ఉందని, పరిశ్రమల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.  ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సులో శనివారం కేటీఆర్‌ మాట్లాడారు. అనుమతులు మంజూరు చేయని అధికారులకు రోజుకు వెయ్యి చొప్పున జరిమాన విధించేలా విధానం రూపొందించామని స్పష్టం చేశారు. తెలంగాణ రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని నీతి ఆయోగ్‌ సహా పలు స్వదేశీ, విదేశీ సంస్థలు, ప్రభుత్వాలు అభినందించాయి. తెలంగాణ రాష్ట్రం సీడ్‌ బౌల్‌గా పేరుగాంచిదని, ఎటువంటి ప్రకృతి పైపరిత్యాల నుంచి ముప్పులేదని ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలత ఉందని ఆయన పేర్కొన్నారు.  భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, ఆర్థికంగా రైతుల విూద ఆధారపడుతుందని, ఇలాంటి దేశంలో ఆహార పరిశ్రమల వల్ల రైతులు లాభపడేలా చూడాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఏడాది సగటు ఆదాయం లక్షా 28 వేలు ఉన్నదని, మరో అయిదేండ్లలో దాన్ని రెట్టింపు చేయనున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. ఈ అంశం కొందరికి నమ్మశక్యం కాకపోయినా తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. ఆ లక్ష్యాలను అందుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా సంసిద్ధంగా ఉందన్నారు. జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆహార పరిశ్రమల ఏర్పాటు ద్వారా కూడా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. క్షీర విప్లవం ద్వారా కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు
చేయనున్నట్లు చెప్పారు. ఈ-నామ్‌లోనూ తెలంగాణ నెంబర్‌ వన్‌ ఉందన్నారు. రాష్ట్రంలో 84 వ్యవసాయ మార్కెట్లకు ఈ-నామ్‌ కనెక్షన్‌ ఉందన్నారు. పారదర్శకమైన మార్కెటింగ్‌ వ్యవస్థతో దళారీలను రూపుమాపుతామని కేటీఆర్‌ అన్నారు.
13 కంపెనీలతో ఒప్పందాలు..
వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా ఈవెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో 13 ఒప్పందాలను కుదుర్చుకున్నది. గత రెండు రోజులుగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి సుమారు రూ.7200 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆహార పరిశ్రమలతో జరిగిన ఒప్పందాల పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వస్తాయని విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు.