రాష్ట్రం ఇవ్వకపోతే..

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ మటాష్‌ అవుతుందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలు నివేదించినట్లుగా సమాచారం. 1969 నుంచి ఇప్పటి వరకు సజీవంగా తెలంగాణ ఉద్యమం, అందుకు కారణాలు, ప్రజల ఆకాంక్షలపై ఐబీ సమగ్ర సమాచారం సేకరించి ఏఐసీసీ అధినేత్రికి తెలియజేసినట్లుగా తెలిసింది. తెలంగాణపై అధ్యయనానికి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత పరిణామాలు, శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనలపై స్థానికంగా ఉన్న పరిస్థితులను అన్వయిస్తూ ఐబీ అధికారులు సమగ్ర సమాచారం సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం, అంతకుముందు హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రజల జీవన విధానం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత వారికి ఎదురైన పరిణాలను వారు నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది.  తెలంగాణకు సీమాంధ్ర ప్రాంత పాలకులు చేసిన అన్యాయాలు, నిధులు, నీళ్లు, వనరులు ఉద్యోగాల దోపిడీ ఎలా జరిగింది, హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆక్రమణలను ఐబీ నివేదికలో ప్రస్తావించినట్లుగా సమాచారం. వీటిని తట్టుకోలేకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ పథాన నడుస్తున్నారని నివేదికలో వివరించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో ప్రస్తుతం ప్రత్యేక

రాష్ట్ర ఆకాంక్ష ప్రబలంగా ఉందని, ఇందుకు సింగరేణి, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌, టీఎంయూ ఘన విజయం సాధించడమే కారణమని వివరించినట్లుగా తెలిసింది. ఇదే పరిస్థితి 2014 ఎన్నికల్లో పునరావృత్తమవుతుందని, ఇప్పటికైనా కేంద్రం స్పందించకుంటే అందుకు పూర్తి మూల్యం కాంగ్రెస్‌ పార్టే చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఎన్నికల సంగతి తర్వాత ఇప్పటికిప్పుడు తెలంగాణపై తేల్చకుంటే ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీని వీడి సొంతదారి చూసుకుంటారని, ఈమేరకు ఆయా నియోజకవర్గాల ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఇంతకాలం అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూసిన ఎంపీలు అఖిలపక్షం తర్వాత ప్రకటించిన నెలరోజుల గడువు తర్వాతి చర్యల కోసం ఎదురుచూస్తున్నారని, అప్పట్లోగా సానుకూల నిర్ణయం రాకుంటే వారు పార్టీని వీడటం ఖాయమని ఐబీ వర్గాలు వెల్లడించాయి. సమాచారం చూసి ఆందోళన చెందిన అధినేత్రి ఆ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. గురువారం కాంగ్రెస్‌ ముఖ్యులతో సమావేశమైన ఆమె శుక్రవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ కమిటీ భేటీకి ఆదేశించారు. భేటీలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో రిపోర్ట్‌పై ఆసాంతం చర్చించారు. తెలంగాణ ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఒక ప్రకటన చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఎలాగు అఖిలపక్షంలో నెల రోజులు పెట్టిన గడువు జనవరి 27తో ముగుస్తుంది. ఆలోగా ప్రకటన చేస్తే బాగుంటుందని కోర్‌ కమిటీ ముఖ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో 26న రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చాలని సోనియా ఆదేశించినట్లు సమాచారం. దీనిపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని సోనియా నిర్ణయించారు.