రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు నూకలు చల్లినట్లే
ఆదిలాబాద్, జూలై 23 : నాలుగునర కోట్ల ప్రజల సహనాన్ని పరిష్కరించకుండా వెంటనే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు మంగళవారంనాటికి 933వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని సందర్శించిన నేతలు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రతిసారి మోసం చేస్తూ వస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏవో సాకులు చెబుతూ కమిటీలు, సమావేశాల పేరిట కాలయాపన చేసిన కేంద్రం ఇక మీదట స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని వారు హెచ్చరించారు. రాష్ట్రం సాధించేందుకు ప్రజలు అన్ని త్యాగాలను సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉద్యమాన్ని మరంత ఉధృతం చేసి రాష్ట్ర సాధనకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.