రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం చేశారు. రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం ఇదే. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించారు.