రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు
– ఏపీలోని అన్నిశాఖల్లో అవినీతి పెరిగిపోయింది
– జీతాల ఆన్‌లైన్ పక్రియలో రూ.250 కోట్లు అవినీతి జరిగింది
– అమరావతి అభివృద్ధికి సేకరించిన విరాళాలు ఏమైయ్యాయి?
– అవినీతిపై వచ్చేనెల 6న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
నెల్లూరు, సెప్టెంబర్26(జనంసాక్షి) : లక్ష ముప్పయి వేల కోట్లు బాంకుల్లో అప్పు తెచ్చి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. బుధవారం నెల్లూరు నగరంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల బీజేపీ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంకు కన్నా లక్ష్మీ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోతుందన్నారు. ఉద్యోగాలు అమ్ముకుని ఆ డబ్బుని నారాలోకేష్ కి చేరుస్తున్నారన్నారని కన్నా ఆరోపించారు. జీతాలకు ఆన్ లైన్ అంటూ చేసిన పక్రియలో 230కోట్లు అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రాలు కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను ఎందుకు త్వరగా పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ని తిట్టి ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకుంటున్నారని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. పెట్రోల్, డీజల్ కు లీటర్‌కు రూ. 4 సెస్ విధిస్తున్నారని, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి అని దండిన విరాళాలు ఎక్కడికి పోయాయని కన్నా ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా.. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాల్లో భారీ ధర్నాలు చేపట్టనున్నామని తెలిపారు. స్లాట్ లు కొనుక్కుని చైనాకు వెళ్లిన లోకేష్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఎన్జీవోల ఆహ్మానంతో అమెరికా వెళ్లిన చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లక్ష్మీనారాయణ మండిపడ్డారు.