రాష్ట్రాన్ని నట్టేట ముంచిన ‘నీలం’
పట్టాలపైన నిలిచిపోయిన రైళ్లు
పలు రైళ్లు దారి మళ్లింపు , విశాఖ రైళ్లు రద్దు
హైదరాబాద్, నవంబర్ 4 (జనంసాక్షి):
నీలం తుపాన్ ఉధృతికి రాష్ట్రంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో పంట నీట మునగడంతో రైతన్నలు విలవిల్లాడారు. అనధికారిక లెక్కల ప్రకారం రూ. 565 కోట్ల మేర నష్టం జరిగి నట్టు అంచనా. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 22 కు చేరిన మృతులు. నీలం తుపాన్ గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులకు కడగండ్లను మిగిల్చింది. ప్రధానంగా పత్తి, వరి రైతులు తీవ్రంగా నష్టపో యారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట చెతికొస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పైరు పూత, పిందె రాలిపోతుండటమేగాక, పగిలిన కాయలోకి నీరు చేరి గుడ్డి పత్తిగా మారుతోంది. బిర్రు పొట్టదశ, సుంక దశలో ఉన్న లక్షలాది ఎకరాల్లో పరిపైరుకు ఈ వర్షం దెబ్బేనని రైతులు చెప్పారు. అలాగేవేలాది ఎకరాలలో మర్చి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు తదితర పైర్లు నేలకొరిగాయి. అనధికారి ప్రాథమిక అంచనా ప్రకారం గుంటూరు జిల్లాలో వివిధ పంటలకు రూ. 300 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 50 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 215 కోట్లు వరకు నష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా, సుమారు రెండు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అంచనా.
దీంతో పత్తి రైతులకు రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. డెల్టాలో లక్ష ఎకరాల్లో వరి పంటకు ఈ వర్షం నష్టం చేకూర్చిందని ఆ ప్రాంత రైతులు చెప్పారు. ఒక్కొక్క ఎకరానికి రెండు, మూడు బస్తాలు తగ్గవచ్చునని, ప్రస్తుతం ఉన్న ధరతో రూ. 45 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చునని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1.30 లక్షల ఎకరాల్లో మర్చి ముంపులో ఉంది. సత్తెనపల్లి, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు రూరల్, చిలకలూరుపేట, నరసరావుపేట లాంటి ప్రాంతాల్లో మిర్చి మొక్కలు ఈదురు గాలికి నేలవాలుతున్నాయి. మర్చికి అదనంగా పురుగు మందులకు రూ. 10 వేలకుపైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు వ్యక్తం చేశారు. పెద్దనందిపాడు ప్రాంతంలో వందలాది ఎకరాల్లోని పంటలు వర్షపు నీటిలో మునిగాయి. రోజుల తరబడి నీటిలో మినుము పంట నానుతుండటంతో సరుకు రంగు మారే అవకాశముందని, ఎకరానికి రూ. 2, 3 వేల వరకు నష్టం ఉండవచ్చనీ రైతులు చెప్పారు. ఇంకా వేరుశనగ, మొక్కజొన్న, పైర్లకూ నష్టం వాటిల్లింది. వర్షపు నీటి ఉధృతికి పెదనందిపాడు మండలం మల్లాయపాలెం మేజర్ కాలువకు ఐదుచోట్ల పెద్ద ఎత్తున గండ్లు పడ్డాయి. దీంతో ఈ కాలువ పరిధిలో ఉన్న 400 ఎకరాల్లోని పత్తి, మర్చి పంట పొలాలు నీటమునిగాయి. కృష్ణాలో 6.31లక్షల ఎకరాల్లో వరి, లక్షా75వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి పొట్ట దశకు చేరుకోగా కొన్ని చోట్ల ఈనె దశలో ఉంది. ఈ పరిస్థితిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరికి తెగులు ఆశించిన తాలు గింజలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి మూడు బస్తాల చొప్పున దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మైలవరం, జి. కొండూరు, కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, గంపలగూడెం తదితర మండలాల్లో పత్తి తీతలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఎకరానికి మూడు బస్తాల ఐదు క్వింటాళ్ల వరకు పత్తి తీసేందుకు సిద్ధంగా ఉంది. కాయ కుళ్లి రంగుమారితే ధర అమాతంగా పతనమవుతుంది. ప్రస్తుతం క్వింటాలు పత్తి రూ. 3.500 మించి కొనుగోలు చేయడం లేదు. ఎకరానికి గరిష్టంగా తొమ్మిది క్వింటాళ్లకు మంచి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని తోట్లవల్లూరు, మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని వివిధ పంటలకు సుమారు రూ. 50 కోట్లకుపైబడి పంట నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ప్రకాశం జిల్లాలో సాగు ప్రాథమిక దశలో ఉండడంతో నష్టం తక్కువగాఉంది. చాలా మంది రైతులు ఇంకా పంటలు వేయలేదు. వారికి ఈ వర్షం ఎంతో ఉపయోగకరం. వేసిన చోట్ల ఎకరానికి కనీసం రూ. 20 వేల పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. పత్తి రైతులు నిలువునా మునిగారు. ఆ పైర్లు కాయదశలో ఉన్నాయి. నల్లగా మారాయి. ఎకరానికి కనీసం పది వేలు తక్కువగా కాకుండా రైతులకు నష్టం జరిగిందని అంచనా. నాగులుప్పలపాడు మండలం కళ్లగుంటలో గుండ్లకమ్మ కాలువ వల్ల నీరు దిగువకు పోయే మార్గం లేక పొలాలు మునిగాయి. పొగనాట్లు ముందు వేసినవన్నీ కుళ్లిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట నేలకొరిగిందనీ, దీనివల్ల పంట నష్టం సుమారు రూ. 75 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. క్రాసింగ్ దశలో ఉన్న పత్తి పంట వర్షాలకు దెబ్బతిని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 27 వేల ఎకరాల్లో పొగాకు నాట్లు దెబ్బతినే ప్రమాదముందని మెట్ట ప్రాంత రైతులు ఆందోళ చెందుతున్నారు. ఈ వర్షాలు ఆక్వా రైతులకు కూడా తీరని నష్టం కలిగించాయి. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. 10 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటల్లింది. ఉల్లి మొక్కజొన్న, చెరుకు, పొగాకు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటల్లింది. రూ. 120 కోట్ల విలువైన పంట నీటిలోనే ఉంది. వరి పొట్టదశలో ఉండడంతో పూర్తిగా పాడవుతుందని రైతులు భయపడుతున్నారు. ఒకటి రెండు రోజులు వర్షాలు కొనసాగితే పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని వారంటున్నారు. ప్రస్తుతం పంట నీటిలో నేలనంటడంతో సుమారు రూ. 40 కోట్ల పంటనష్టం ఉంటుందనివారు చెబుతున్నారు. ఖరీఫ్ ప్రారంభ నుంచి రెండుసార్లు గోదావరి వరదలు, రెండు సార్లు భారీ వర్షాలు వరి, పత్తి పంటలకు నష్టం కలిగించాయి. జిల్లాలో కొందరు రైతులు రెండు, మూడు సార్లు నాట్లేయాల్సి వచ్చింది. పంట చేతికంటే సమయానికి నీలం తుపాన్ రైతును నిలువునా ముంచింది. వరంగల్ జిల్లాలో 6 లక్షల 70 వేల ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఇప్పటికే మొదటి విడత పత్తి తీశారు. రెండోసారి తీయాల్సిన సమయంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పత్తి తడిసి ముద్దయింది. దీంతో పత్తి నల్లబడి ధర సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. లక్ష ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం పొట్టదశలో ఉంది. బావులు, బోర్ల కిందసాగు చేసిన వరిని కోసి మెదలేశారు. ఈ వర్షంతో పోలంలో నీరు నిలిచి వరి మెదలు నీటమునిగాయి. ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుమ్ముగూడెం మండలంలో 20 వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. మహదేవపురం, ఆర్లగూడెం, లచ్చిగూడెం, భీమవరం, మారాయిగూడెం, చెరుపల్లి గ్రామాల్లో కోసిన వరి మెదలు తడిశాయి. చింతూరు మండలలో 1500 ఎకరాల్లో అన్ని పంటలకూ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కల్లూరు, తల్లాడలో కోసిన వరి నీటమునిగింది. తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి, తిరుమలయపాలెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెం, వెదుళ్లచెరువు గ్రామాల్లో ఐదు వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. దెబ్బతిన్న పత్తిని ఖమ్మం ఆర్‌డివో వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. వైరా మండలంలో తడిసిన పత్తిచేలను కలెక్టర్ సిద్దార్థ్‌జైన్, జెడిఏ రఫీ ఆహ్మద్ పరిశీలించారు. పంట నష్టం వివరాలనుఅంచనా వేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
వరద కారణంగా పలు రైళ్లు రద్దు:
పలు జిల్లాల్లో వరద నీటి ఉద్థృతి కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-విశాఖ రత్నాచల్, గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. వీటితో పాటు మచిలీపట్నం-నర్సాపురం, తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా, చెన్నై-అసంసోల్, హిందూపురం-తాడే పల్లిగూడెం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు.
రైళ్ల దారి మళ్లింపు:
భారీ వర్షాలతో రైల్వేలైను దెబ్బతినడం మూలంగా పలుచోట్ల నిలిచిపోయిన రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నారు. చీరాల వద్ద ఉన్న అలెప్పిధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ వద్ద నిలిచిపోయిన నాందేడ్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, నిడదవోలు వద్ద ఉన్న యశ్వంత్‌పూర్-హతియా ఎక్స్‌ప్రెస్‌లను నాగపూర్, బిలాన్‌పూర్, టాటానగర్‌ల మీదుగా దారిమళ్లించి నడుపుతున్నారు.
విశాఖ నుంచి బయల్దేరే రైళ్లన్నీ రద్దు
ఈ రోజు సాయంత్రం విశాఖ పట్నంనుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు బయల్దేరాల్సిన రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. విశాఖ-నిజాముద్దీన్, గోదావరి, తిరుమల ఎక్స్‌ప్రెస్, గరీబ్‌రథ్, దురంతో ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లను రద్ద చేసినట్లు అధికారులు ప్రకటించారు.