రాష్ట్ర అభివృద్ధికి సాయమందించండి
హైదరాబాద్,డిసెంబరు 30 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు మరియు హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ఇంజన్ అయిన రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. దీర్ఘకాలికంగా హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంప్రహెన్సివ్ సివరేజ్ మాస్టర్ ప్లానింగ్ దిశగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రక్క ప్రణాళికతో ముందుకు పోతుందని తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక,సర్వే, డిజైన్, అంచనాలు నిర్దారణ వంటి కార్యక్రమాలను పూర్తి చేసిందని, ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా మూడు ప్యాకేజీల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా సివరెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లతోపాటు మురికి నీటి ట్రంక్ లైన్ల ఏర్పాటు వంటి వాటితో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.కొద్ది రోజుల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్ మూసీ నది కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ కి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. యస్టిపిలతోపాటు సివరేజ్ కలక్షన్ నెట్వర్క్ ట్రంక్, సివర్ లైన్ల నెట్వర్క్ మొత్తం 2232 కిలోవిూటర్ల మేర ఉండే అవకాశం ఉందని, వీటి కోసం సుమారు 3722 కోట్ల రూపాయలతో 36 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ కాంప్రహెన్సివ్ సివరీజ్ మాస్టర్ ప్లాన్ కి కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులను అంటే సుమారు 750 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు.దీంతో పాటు తాజాగా హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేని విధంగా వచ్చిన వరదల పైన అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వరదలకు ప్రధాన కారణమైన ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని నాలాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని తీసుకుందని, హైదరాబాద్ నగర పరిధిలోని నాలాలను మరియు వాటర్ డ్రైన్ లను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పనులు చేపడుతున్నట్లు తెలిపింది.ఈ కార్యక్రమానికి 1200 కోట్ల వార్షిక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసిందని ఇందులో కనీసం 20 శాతం అంటే 240 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రులను కోరారు.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అతి పెద్ద పట్టణం అయిన వరంగల్ నగరంలో ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నియో మెట్రో రైల్ ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే నియో మెట్రో కి సంబంధించిన ప్రమాణాలను, ప్రత్యేకతలను కేంద్ర ప్రభుత్వం తుది రూపు ఇచ్చిన నేపథ్యంలో, వరంగల్ నగరానికి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం వరంగల్ జనాభా దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని, 2051 నాటికి 35 లక్షల వరకు వరంగల్ జనాభా పెరిగే అవకాశం ఉందని, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ పట్టణంలో మహారాష్ట్రలోని నాసిక్ తరహాలో నియో మెట్రో ప్రాజెక్ట్ ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాసిక్ మెట్రో కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో వరంగల్ నియో మెట్రో కి సంబంధించిన డి పి ఆర్ సిద్ధం అయిందన్నారు.సుమారు 15.5 కిలోవిూటర్ల ఉండే వరంగల్ మెట్రో కారిడార్ కి 1,050 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, ఇందులో లో 20 శాతం నిధులు అంటే 210 కోట్ల రూపాయలను ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర పురపాలక శాఖ తరఫున రాష్ట్రంలోని పురపాలికల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని పురపాలికల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం సుమారు 258 కోట్ల రూపాయలతో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి డంపును (ఇప్పటి వరకు ఉన్న చెత్త) 520 కోట్ల రూపాయల ఖర్చుతో బయో మైనింగ్ మరియు రేమేడియేశన్ చేస్తున్నట్లు తెలిపారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ లకు సంబంధించి ఇప్పటికే 76 పురపాలికల్లో పనులు పూర్తయ్యాయని, ఇందుకోసం సుమారు 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో సుమారు 13,228 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు కు నిధులు అవసరం అవుతాయని, అయితే అందులో మొదటి దశ కింద 30 పట్టణాల్లో 2828 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇలా దాదాపు 3777 కోట్ల రూపాయలతో రానున్న సంవత్సరం లో వివిధ పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో కనీసం 20 శాతం అంటే 750 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.