రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్‌డిఎతో ఆనాడు పొత్తు


కేంద్రం తీరుతో బయటపడ్డామన్న బాబు
ఎపికి అన్యాయాలను సహించేది లేదని హెచ్చరిక
విజయనగరం ధర్మపోరాట సభలో బాబు
విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు కేంద్రంతో పొత్తు పెట్టుకొని, ఎన్డీయేలో చేరామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. అయితే కేంద్రం తమను విస్మరించడంతో పాటు ఎపి ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ప్రవర్తించడంతో ఎన్‌డిఎ నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. న్యాయం, ధర్మం కోసం కేంద్రంపై తాము పోరాటం కొనసాగిస్తామని, అంతిమ విజయం తమదే అవుతుందని చెప్పారు. మంగళవారం ఆయన విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించిన తెదేపా ధర్మపోరాట సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాజ్‌పేయీ హయాంలో మంత్రి పదవులు ఇస్తామంటే వద్దని దేశాన్నిబాగు చేయాలని చెప్పిన ఏకైక పార్టీ టిడిపి అన్నారు. చివరి బ్జడెట్‌లో కూడా ఏపీకి అన్యాయం చేశారు. అందుకే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం. దానిపై చర్చ సందర్భంగా నా కంటే కేసీఆర్‌కు మెచ్యూరిటీ ఉందని, నేను
వైకాపా ట్రాప్‌లో పడ్డానని మోదీ అన్నారు.  అమరావతిలో, తిరుపతిలో.. రకరకాల మాటలు చెప్పారు. ప్రధానిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో, బెదిరింపులతో రాజకీయం చేస్తే న్యాయమా? తెలుగు ప్రజలు ఉపేక్షిస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ ఎంపీలను మోదీ బెదిరించారు. ఐటీ, ఈడీ, సీబీఐ ద్వారా ఎన్ని విధాల వీలైత అన్నివిధాలుగా దాడులు ప్రారంభించారు. ఈ దాడులకు భయపడతామా? భయపడాలా? అని ప్రశ్నించారు. ప్రత్యేక ¬దా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారు. పోలవరం పూర్తి చేస్తామని, రెవెన్యూ లోటు కింద రూ.16వేల కోట్లు ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. బుందేల్‌ఖండ్‌ మాదిరిగా ప్యాకేజీ ఇస్తామన్నారు. భాజపా నేతలు కడప వెళ్లి రాయలసీమ డిక్లరేషన్‌ అంటారు గానీ స్టీల్‌ప్లాంట్‌ మాత్రం ఇవ్వరు. ఇదెక్కడి న్యాయం? తెదేపా జెండా ఎన్డీయే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే మేమే ఏర్పాటు చేసి కడప జిల్లాను ఆదుకుంటాం. కడప జిల్లాకు చెందిన నాయకుడు జగన్‌ కోడికత్తి డ్రామా ఆడుతున్నారు. కడప జిల్లాలో ప్రజలు ఉక్కు పరిశ్రమ కోరుతుంటే ఆయన కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడితే జైలుకు పోతానని ఆయనకు భయం. నరేంద్ర మోదీని చూస్తే జగన్‌కు వెన్నెముకలో వణుకు. రాష్ట్రానికి  జరుగుతున్న అన్యాయం, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నా. ఎవరు మాట్లాడకపోయినా డిసెంబర్‌ నెలలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తాం అని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంచేశారు.
అన్యాయాన్ని ఎదిరించేందుకే అవిశ్వాసం: ఎంపి
విభజనతో నష్టపోయిన ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని దిల్లీ స్థాయిలో విన్పించాలనే పార్లమెంట్‌లో అవిశ్వాసం ప్రవేశపెట్టిన సందర్భంలో మోదీని ఎదిరించే ప్రయత్నం చేశామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. దివంగత నేత ఎర్రన్నాయుడు ఉంటే ఏ తరహాలో పోరాడేవారో అదే తరహాలో తెలుగు ప్రజల గళాన్నితాను విన్పించే దిశగా కృషిచేసినట్టు చెప్పారు. ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. హక్కుల కోసం పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పగ పెంచుకుంటున్నారని, తెదేపా నేతలపై ఈడీని వదులుతున్నారని మండిపడ్డారు. సీబీఐని తారుమారు చేసి నేతలపై పంపిస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీ సుజనా చౌదరి ఏపీకి ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలు కోసం ప్రయత్నిస్తే.. తెదేపాపై బురద చల్లాలనే ప్రయత్నంతో ఆయనపై ఈడీదాడులు చేయించారని విమర్శించారు. ఆయన విూడియా ముందుకు వచ్చి ఆధారాలతో నిరూపించాలని సవాల్‌ విసిరితే ఏ ఒక్క భాజపా నేత, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేందుకు ముందుకు రావడంలేదన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులివ్వమంటే ఇప్పటివరకు కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో సర్థార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహానికి మాత్రం రూ.3వేల కోట్లు ఖర్చుచే చేశారని మండిపడ్డారు. సర్థార్‌ పటేల్‌పైనా, దేశ ఐక్యతపైనా మోదీకి గౌరవం ఉంటే.. ఆయన ఒక్కరే ఆ రోజు ఫొటోలు దిగేవారు కాదన్నారు. రాష్ట్రంలోని 29 రాష్ట్రాల సీఎంలను పిలిపించి వారితో కలిసికట్టుగా చేతులు కలిపి విగ్రహం ముందు నిలబడి ఐక్యతను చాటే వారన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా రాకుండా అడ్డుకుంటూ రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిత్లీ తుపానుతో సిక్కోలు ప్రజలు సర్వస్వం కోల్పోతే అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు ఏడు రోజులు అక్కడే ఉండి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారన్నారు. అదే బాటలో మంత్రి లోకేశ్‌ కూడా అక్కడే ఉండి మందస మండలాన్ని
దత్తత తీసుకొని సిక్కోలు ముద్దుబిడ్డగా సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను శ్రీకాకుళం వచ్చి ప్రజలను ఆదుకోవాలని అడిగితే రాజకీయాలకు ముందుచూపు తప్ప ఆయన జిల్లాకు రాలేదనని విమర్శించారు. దీంతోనే ఆయన రాజకీయ కుట్ర అందరికీ అర్థమవుతుందని చెప్పారు. తెదేపాను గ్దదె దించాలని అంతా ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంపై జగన్‌, మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ¬దా ఎందుకు ఇవ్వడంలేదో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.