రాష్ట్ర రహదారులపై సిఎం సవిూక్ష

అమరావతి,నవంబర్‌22(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రహదారులపై సంభందిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సవిూక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సవిూక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రహదారులు సుందరంగా ఉండాలన్నారు. అలాగే సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల్లో రహదారుల పరిస్థితిపై సంతృప్తి రావటం ముఖ్యం అన్నారు. అలాగే రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి.., ఎందుకు కుంగిపోతున్నాయో శాస్త్రీయ అధ్యయనం చేసి పరిష్కారాలు కనుగొనాలన్నారు. రహదారులపై సీసీ కెమెరాలు అమర్చాలని, హైవేల్లో వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాల సంఖ్య నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే రహదారులపై రద్దీకి అనుగుణంగా రోడ్లు ఆ రద్దీని తట్టుకునే సామర్ధ్యంతో మరమ్మతులు చేయవచ్చని, గుంతలు, గతుకులు లేకుండా చేసి ప్రజల్లో సంతృప్తి పెంచాలని సీఎం ఆదేశించారు.