రాష్ట్ర విభజన తరవాత ఎన్నో సమస్యలు
ఉద్యోగుల సహకారంతో ముందుకు సాగుతున్నా
ఇక ఫోన్ల ద్వారానే ప్రజల సమస్యలపై ఆరా
గ్రామదర్శినిలో సిఎం చంద్రబాబు నాయుడు
ఏలూరు,సెప్టెంబర్4(జనం సాక్షి): రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, జవాబుదారీతనంలేని పాలనను కాంగ్రెస్ హయాంలో చూశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. టిడిపి హయాంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ¬ంగార్డులందరికీ న్యాయం చేశామని పేర్కొన్నారు. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా.. ఉద్యోగులు మాత్రం అండగా నిలిచారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయగూడెంలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమానికి సిఎం నారా చంద్రబాబునాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతీరోజు 15లక్షల ఫోన్ కాల్స్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలపై విపక్ష కార్యకర్తల మాటలను నమ్మొద్దని సూచించారు.ఇక సెల్‌ఫోన్ ద్వారానే భవిష్యత్తులో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సరైన సేవలు అందించని రేషన్ డీలర్లను తొలగిస్తామని హెచ్చరించారు. గ్రామదర్శిని ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి పదేళ్ల ప్రణాళికలు రచించామని సీఎం వివరించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. తమ పాలనలో వినూత్న మార్పులు-చేర్పులూ తెచ్చామని వెల్లడించారు. ఇంతవరకూ నరేగాలో ఎపికి 10 జాతీయ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా చింతలపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, రాజ్యసభ సభ్యురాలు తోటసీతా రామలక్ష్మి, ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యే పీతల సుజాత, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రవిప్రకాష్, ఎమ్మెల్సీ యమ్ హెచ్.షరీఫ్, జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తదితరులు పాల్గన్నారు.
సమస్యలు తెలుసుకోవడానికే గ్రామదర్శిని
గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికే గ్రామదర్శిని గ్రామవికాసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలంలోని జానాంపేట, జగన్నాథపురం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మురుగు నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోవడంతో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. పలువురు గృహాలు మంజూరు చేయాలని కోరగా వెంటనే మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్కయ్య, సహకారం సంఘం అధ్యక్షుడు సుధాకర్, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.