రికార్డుస్థాయిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి

6tf3fkigబొగ్గు ఉత్పత్తుల్లో సింగరేణి వార్షిక లక్ష్యాల దిశగా ఉరకలు వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) మరో 15 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే 48.85 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం విశేషం. గత ఏడాది ఇదేకాలానికి 46.69 మిలియన్ టన్నుల మేరకు ఉత్పత్తి జరిగింది. సింగరేణిలో భారీ యంత్రాలు 20 నుంచి 23 గంటలకు పైగా పనిచేస్తున్నాయి. వీటి అపరేటర్లు, మెయింటెనెన్స్ సిబ్బంది, అధికారులు పూర్తిస్థాయి పనిగంటల్లో నిమగ్నమవుతూ సింగరేణి చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పుతున్నారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సింగరేణి భవన్నుంచి పదకొండు ఏరియాల్లోని ఓపెన్కాస్టు మైనింగ్ అధికారులు, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గనిలో ఉత్పత్తి పెరుగుదల పట్ల సీఎండీ సంతృప్తి వ్యక్తంచేశారు. మార్చి నెలాఖరుకు ప్రతి గనిలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. రికార్డుస్థాయిలో ఉత్పత్తులు సాధించిన కార్మికులు, ఉద్యోగులకు ఏప్రిల్ రెండో వారంలో వారి వారి గనుల్లో సన్మానసభలు నిర్వహిస్తామని సీఎండీ ప్రకటించారు.