రిటైర్మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్

159వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతానని మంగళవారం ప్రకటించాడు. ఫిబ్రవరి 20న హేగ్లే ఓవల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ అతడికి 101వది. రెండేళ్లుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న 34 ఏళ్ల  మెక్ కల్లమ్ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.

‘ఆటగాడిగా, కెప్టెన్ నాకు ఇచ్చిన అవకాశాలను ఎంతో ప్రేమించా. ఆటకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సొంత దేశం తరపు ఆడడం మర్చిపోలేని అనుభవం’ అని మెక్ కల్లమ్ అన్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన మెక్ కల్లమ్ 38.48 సగటుతో 6,273 పరుగులు సాధించాడు.

2013లో మూడు ఫార్మాట్లకు న్యూజిలాండ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. మార్చి, ఏప్రిల్ లో జరగనున్న టి20 వరల్డ్ కప్, ఆగస్టులో సౌతాఫ్రికా, జింబాబ్వే టూర్లకు కెప్టెన్ వ్యవహరిస్తాడని భావించారు. అయితే టి20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించేవరకు ఆగకూడదన్న ఉద్దేశంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మెక్ కల్లమ్ వారసుడిగా 25 ఏళ్ల కానే విలియమ్సన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించనున్నారు.