రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
న్యూయార్క్ : రాజకీయ విధానాలు తనకు వ్యతిరేకంగా పోగు పడ్డాయని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. వచ్చే మంగళవారం న్యూయార్క్‌లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీపై తన అక్కసును వెళ్ళగక్కారు. మంగళవారం రాత్రి ఓ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు నిబంధనలన్నీ బాగా తెలుసునన్నారు. అయితే వాటన్నిటినీ తనకు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఏర్పాటు చేసిందన్నారు. కొలరాడో, లూసియానా ప్రైమరీల్లో అన్యాయంగా జరిగిందని ఆరోపించారు. అంతకుముందు మరో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ నామినేషన్ ప్రక్రియ భారీ కుంభకోణమని ఆరోపించారు. పార్టీకి ఇది అవమానకరమన్నారు. రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రెయిన్స్ ప్రీబస్ సిగ్గుపడాలన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై రెయిన్స్ ప్రీబస్ ఘాటుగా స్పందించారు. నామినేషన్ ప్రక్రియ గురించి ఏడాది క్రితమే అందరికీ తెలుసునన్నారు. దానిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పోటీలో ఉన్న అందరిపైనా ఉందన్నారు. ఇప్పుడు ఫిర్యాదులు చేయడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.