రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే ఇదేనా బాబు!

– వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్‌
అమరావతి, డిసెంబర్‌17(ఆర్‌ఎన్‌ఎ) : పెథాయ్‌ తుఫాను కల్లోలంతో ఏపీలోని కోస్తా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటున్న సమయంలో వారికి అండగాఉండి, భరోసా ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబుకు అవేవిూ పట్టడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీలో పాలనను గాలి కొదిలేసి ప్రత్యేక విమానాల్లో వెళ్లి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే ఇదే కాబోలంటూ సెటైర్లు విసిరారు. సోమవారం విజయసాయిరెడ్డి విూడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తుంటే, ఇతర రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు వెళ్లారనివిమర్శించారు. ఏపీ మంత్రులు కూడా హైదరాబాద్‌ లో ప్రైవేట్‌ ఫంక్షన్‌ లో ఉన్నారని, తుపాన్‌ వచ్చే సమయంలో సీఎం పనిచేయరని, తుపాన్‌ వచ్చాక అధికారులను పనిచేయనివ్వరని విమర్శించారు. సహాయక చర్యల సమయంలో సీఎం తన మందీమార్బలంతో అధికారుల పనులకు అడ్డుతగులుతుంటారని, సోమవారం వేరే రాష్ట్రాల్లో ఉన్న చంద్రబాబు మంగళవారం వచ్చి హడావుడి చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పెథాయ్‌ ను చంద్రబాబు జయించాడంటూ ప్రచారం చేస్తారని, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, రైతులకు వైసీపీ అండగా ఉంటుందని విజయసాయిరెడ్డి  అన్నారు.