రియోలో పేస్‌కు గది కేటాయించలేదు

5brk-paesఇంటర్నెట్‌డెస్క్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌కు రియో ఒలింపిక్‌ గ్రామంలో ఘోర అవమానం ఎదురైంది. ఒలింపిక్స్‌-2016లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం రియో డి జెనీరో చేరుకున్న పేస్‌కు అక్కడి సిబ్బంది గది కేటాయించలేదు. దీంతో పేస్‌ నిరుత్సాహానికి గురయ్యాడు.

దీనిపై పేస్‌ మాట్లాడుతూ… ఆరుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తనకు గది కేటాయించకపోవడం ఎంతో బాధనిపించిందని అన్నాడు. న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనడంతో మిగతా ఆటగాళ్లతో కలిసి రాలేకపోయానని పేస్‌ తెలిపాడు. టోర్నీ ముగియగానే రియోకు బయలుదేరినట్లు తెలిపాడు. ఒక అపార్టుమెంట్‌లో ఆటగాళ్లకు మూడు గదులు కేటాయించగా ఒక దానిలో భారత కోచ్‌ జీషాన్‌ అలీ ఉన్నారని, మరో రెండు గదుల్లో టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌, టీమ్‌ ఫిజియోథెరపిస్టు ఉన్నారని తెలిపాడు.

దాంతో తాత్కాలికంగా పేస్‌ రాకేశ్‌ గుప్తా గదిని వినియోగించుకున్నాడు. రోహన్‌ బోపన్నతో కలిసి గది పంచుకోనని తాను చెప్పినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని పేస్‌ తెలిపాడు. ఆగస్టు 6న పేస్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్నతో కలిసి తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు. రోహన్‌ బొపన్న తనకు జంటగా తొలుత సాకేత్‌ మైనేనిని ఎంచుకోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.