రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ శుభారంభం
అభిమానుల అంచనాలను నిజం చేస్తూ.. ఇండియన్ హాకీ టీమ్ రియో ఒలింపిక్స్ లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. పతకం పై అభిమానుల ఆశలను పెంచేలా.. టీమ్ హాకీ ప్లేయర్లు సూపర్ పర్ ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.
రియో ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో టీమ్ హాకీ ఐర్లాండ్ పై 3-2 గోల్స్ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే.. భారత హాకీ టీమ్ పూర్తి అధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శ్రీజేశ్ ఆధ్వర్యంలో ఐర్లాండ్ గోల్ పోస్ట్ పై ఇండియన్ ప్లేయర్లు వరుసగా దాడులు చేశారు. మ్యాచ్ 15వ నిమిషంలో రఘునాథ్ ఫెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో.. భారత్ అధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రూపిందర్ పాల్ సింగ్ వరుసగా రెండు ఫెనాల్టీ కార్నర్ లను గోల్స్ గా మలచడంతో మ్యాచ్ పై పూర్తిగా పట్టు సాధించింది. మరో వైపు ఐరిష్ ఆటగాళ్లు భారత్ డిఫెండర్లను దాటుకుంటూ.. రెండు గోల్స్ ను సాధించడంతో.. భారత్ అధిక్యత 3-2కు తగ్గింది.
అటు తొలి మ్యాచ్ లోనే సాధించిన విజయం.. టీమ్ హాకీకి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని.. రాబోయే మ్యాచ్ లలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరో వైపు గత 12 యేళ్లలో ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. బీజింగ్ ఒలింపిక్స్ కు కనీసం అర్హత సాధించలేకపోయిన టీమ్ హాకీ.. లండన్ విశ్వ క్రీడల్లో ఒక్క విజయం లేకుండానే.. ఆఖరి స్ధానంతో వెనుదిరిగింది.
మరో వైపు పూల్- బి లో అర్జెంటీనా – నెదర్లాండ్స్ టీమ్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక భారత్ తమ రెండో మ్యాచ్ ను ఈ నెల 8న డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ జర్మనీతో తలపడతుంది.