రీవాల్యూయేషన్‌ తో మారిన ..  సీబీఎస్సీ టాపర్స్‌ లిస్ట్‌

రీవాల్యూయేషన్‌ తో మారిన ..
సీబీఎస్సీ టాపర్స్‌ లిస్ట్‌
– టాపర్‌గా ఇష్రితా గుప్తా
న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ 12వ తరగతి పరీక్షల రీవాల్యూయేషన్‌ జరిపిన జాబితాను ప్రకటించింది. వెలువడిన ఫలితాల్లో నాగ్‌ పూర్‌ కు చెందిన ఇష్రితా గుప్తా టాపర్‌ గా నిలిచింది. రెండు నెలల క్రితం ప్రకటించిన ఫలితాల్లో నోయిడాకు చెందిన మేఘన శ్రీవాస్తవా 12వ తరగతి ఫలితాల్లో టాపర్‌ గా వచ్చింది. సీబీఎస్సీ రీవాల్యూయేషన్‌ జరిపిన తరువాత ప్రకటించిన తాజా జాబితాలో టాపర్స్‌ మారిపోయారు. పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ లో తన 17 సమాధానాలు తప్పుగా దిద్దారని రీవాల్యూయేషన్‌ తరువాత 22 మార్కులు అదనంగా వచ్చాయని ఇష్రితా గుప్తా తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహరం తరువాత తీసుకున్న చర్యల్లో భాగంగా జరిపిన రీవాల్యూయేషన్‌ లో 50శాతం విద్యార్ధులు మెరుగైన మార్కులు సాధించారని సీబీఎస్సీ బోర్డు తెలిపింది.
రీవాల్యూయేషన్‌ కు గానూ మొత్తం 9,111 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 4,632
మంది విద్యార్ధులు అంతకు ముందుకంటే మెరుగైన మార్కులను సంపాదించారు. పేపర్‌ వ్యాల్యూయేషన్‌ సమయంలో కొందరు ఉపాధ్యాయులు సరైన జవాబులకు కూడా సున్నా మార్కులు వేసినట్లు తెలుస్తుంది. మరికొందరు సమాధానాలను సరిచూడకుండానే మార్కులు వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మే 26న ప్రకటించిన సీబీఎస్సీ 2018 ఫలితాల్లో ఒక్క మార్కు తేడాతో శ్రీవాస్తవ 99.8 శాతంతో టాపర్‌ గా నిలిచింది. అనుష్క చంద్రకు 99.6 శాతంతో రెండోస్ధానం దక్కింది. మూడో స్ధానంలో ఏడుగురు విద్యార్ధులు నిలిచారు. తమిళనాడు, న్యూఢిల్లీ కంటే తిరువనంతపురంలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది.