రుణ మంజూరులో తొలగని అడ్డంకులు

విజయవాడ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): రైతులకు సులభంగా రుణాల మంజూరుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా ఇంకా పారదర్శకంగా రుణాల పంపిణీ జరగడం లేదు. ఇటీవల సిఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో బ్యాంకర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉత్తర్వులు వెలువరించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితం కనిపించడం లేదు. తాము నిర్దేశిరచినట్లున్న పత్రాలపై రెవెన్యూ అధికారులతో సంతకం చేయించి తీసుకువస్తేనే రుణం ఇస్తామని తెగేసి చెబుతున్నారు.  రుణం కోసం రైతులు బ్యాంకుల చుట్టూ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. పంట రుణాల మంజూరులో రైతులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవద్దని ముఖ్యమంత్రి బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పారని అధికారులు, రైతులు వెల్లడించారు. ప్రతి బ్యాంకర్‌ ఈ-పాస్‌ పుస్తకం విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని, ఈ విషయంలో ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే దస్తావేజులు తనిఖీ చేసుకొని రుణం ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ సవరణను బ్యాంకర్లు లెక్కలోకే తీసుకోవడం లేదు. పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌, అడంగల్‌ లాంటివి తనిఖీ చేసి, టైటిల్‌డీడ్‌ తమ దగ్గర ఉంచుకొని బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. అయితే  ఆన్‌లైన్‌లో ఉండే వివరాలన్నీ సరైనవేననే నమ్మకం లేకపోవడం లాంటి అంశాల కారణంగా తాము ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కారణాలు ఏవైనా సకాలంలో రుణాలు అందకపోవడంతో  రైతులు దిక్కుతోచనిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తాజావార్తలు