రూపాయి విలువ పతనంపై స్పందించిన జైట్లీ

పరిస్థితులను పరిశీలిస్తున్నామని వెల్లడి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): దేశ చరిత్రలో తొలిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా 70రూపాయలకు పడిపోయింది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అస్థిరత ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశంలో సరిపోయే విదేశీ మారక నిల్వలలున్నాయని చెప్పారు. ఎప్పటి కప్పుడు పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. టర్కీ కరెన్సీ లీరా ప్రభావంతో విదేశీ మార్కెట్లపై ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం రూ.70.09 పడిపోయింది. రూపాయికిదే జీవనకాల కనిష్ఠం కావడం గమనార్హం. రూపాయితో పాటు వివిధ దేశాల కరెన్సీ విలువ కూడా భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో జైట్లీ ట్విటర్‌ వేదికగాబుధవారం స్పందించారు. ఒకవేళ కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అస్థిరత ఏర్పడినా ఆ తీవ్రత తగ్గించడానికి సరిపడా విదేశీ మారక నిల్వలు దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తున్నామని, ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆగస్టు 3 నాటికి 402.70 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.