రూ.31వేల సీలింగ్ ఎత్తివేయండి : చంద్రబాబు
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): రూ.31వేల సీలింగ్‌ను ఎత్తివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మంగళవారంనాడు మాట్లాడుతూ ఫీజుల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కొత్త విధానం వల్ల పేద విద్యార ు్థలకు నష్టం వాటిల్లుతోందన్నారు. ముఖ్యంగా బీసీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. టీడీపీ హయాంలోనే ఫీజు రియంబర్స్‌మెంటు విధానం అమలైందన్నారు. బీసీలకు 100 సీట్లు ఇస్తామని తాము ప్రకటించిన తరువాత పార్టీల ధోరణిలో మార్పు వచ్చిందన్నారు. చట్టసభల్లోకి వెనుకబడిన వర్గాలను తెచ్చేందుకే రానున్న ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని ప్రకటించామన్నారు. పేదల పిల్లలపై భారం మోపడం న్యాయం కాదన్నారు. పెంచిన ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఓట్ల కోసం స్కీములు పెట్టి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌ను తారుమారు చేశారన్నారు. చేనేత రంగాల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. చేనేత వస్త్రాలపై వ్యాట్ విధించి చేనేత కార్మికులపై మరింత భారం మోపారన్నారు. వెంటనే వ్యాట్ ఎత్తివేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండు చేశారు.