రెండోరోజుకు చేరిన ఐకెరెడ్డి పాదయాత్ర
ఆదిలాబాద్, అక్టోబర్ 31: తన రాజకీయ భవిష్యత్ కోసం మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర బుధవారం రెండోరోజుకు చేరుకుంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడంతో ఆలకబూనిన ఐకెరెడ్డి ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కొనప్పలతో పాటు ఆయన అనుచర వర్గం పార్టీకి రాజీనామా చేసినప్పటికి ఏ పార్టీలో చేరతారో ప్రకటించలేదు. తెలంగాణ విషయమై కేంద్రం జాప్యం చేస్తుందని నిరసిస్తు రాజీనామా చేశామని ఐకెరెడ్డి ప్రకటించినప్పటికి పార్టీలో ఇమడ లేక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే రాజీనామా చేశారని ప్రచారం జరుగుతుంది. రాజీనామా చేసి రెండు వారాలు అవుతున్నా వైఎస్‌ఆర్ పార్టీలో చేరకపోగా తన నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి మద్దతుదారులను కూడగట్టుకొని నవంబర్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరతారని ఆయన వర్గీయులు ప్రకటించారు.