రెండోరోజూ జోరుగా పల్లెబాట
ఆదిలాబాద్, డిసెంబర్ 6 : తెలంగాణ ఉద్యమాన్ని గ్రామగ్రామాన ఉధృతం చేసే దిశగా టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రెండవ రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సమయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీహరిరావులతో పాటు ప్రధాన నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొని వివిధ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ ఆకాంక్షను కేంద్రానికి తెలయజేయడమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్న కేంద్రం స్పందించక నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు దుయ్యబట్టారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలను మరింత చైతన్యవంతులుగా చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒట్టెతు పోకడలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్న పార్టీలని, నాయకుల వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేసి పార్టీ బలోపేతం చేసే విధంగా నాయకులు కృషి చేస్తున్నారు.