రైతన్నలను నిండా ముంచుతున్న నకిలీ విత్తనాలు…..

దౌల్తాబాద్, జూన్ 18, జనం సాక్షి.
మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన రైతు ఓ రైతు మండల కేంద్రంలోని విఘ్నేశ్వర ఫర్టిలైజర్ షాప్ లో పిహెచ్ఎస్ సీడ్స్ కి సంబందించిన గోరు చిక్కుడు విత్తనాలను కోనుగోలు చేసి సాగు చేశాడు. తీరా చూస్తే దిగుబడి రాక నష్టాల పాలయ్యాడు. తనకు జరిగిన నష్టానికి బాధ్యత వ్యవసాయ అధికారులు తీసుకుంటారా,లేదా షాపు యజమాని తీసుకుంటాడా అని ప్రశ్నించాడు.
అసలు ప్యాకింగ్‌కు ఏమాత్రం తేడా కనిపించదు… లోతుగా పరిశీలిస్తే తప్పా అది నకిలీ ప్యాకింగ్‌గా గుర్తించలేము. ఏ మాత్రం తేడా లేకుండా రంగురంగుల బొమ్మలతో ప్యాకింగ్‌లు తయారు చేస్తారు… ఈ విత్తనాలు ద్వారా దండిగా దిగుబడి వస్తుందని రైతులను బాగా నమ్మిస్తారు… ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మె రైతులు రంగురంగుల ప్యాకింగ్‌లు చూసి మోసపోతున్నారు. వాటిని కొనుగోలు చేసి సాగు చేసిన తరువాత గానీ అవి నకిలీ విత్తనాలనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా పూర్తి స్థాయిలో మాత్రం బ్రేక్‌ పడటం లేదు. ప్రతిఏటా కోట్లాది రూపాయల విలువైన నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రావడం రైతులు కొనుగోలు చేయడం మోసపోవడం పరిపాటిగా మారింది…
విత్తనాలు మార్చడం ద్వారా దిగుబడి బాగా వస్తుందనే ఆశతో రైతులు నిలువున మోసపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని దళారులు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
 నకిలీ విత్తనాల ప్యాకెట్లకు… అసలు విత్తనాల ప్యాకెట్లకు ఏమాత్రం తేడా లేకపోవడంతో రైతులు ఏదీ అసలు… ఏదీ నకిలీ అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. పంట ఏపుగా రావడంతో బాగా దిగుబడి వస్తుందని గుడ్డిగా నమ్ముతున్నారు. రానురాను దిగుబడి అంతగా రాకపోవడంతో తాము సాగు చేసింది నకిలీ విత్తనాలు అని రైతులు గ్రహిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం కాస్త పూర్తి అవుతోంది.
 కాగా వ్యవసాయ, విజిలెన్స్‌ అధికారులు తీవ్ర ఉదాసీన వైఖరి అవలంబించడంతో నకిలీ, నాసికరం విత్తనాలు రంగప్రవేశం చేసేందుకు కారణమవుతున్నాయనే బలమైన ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి.